పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు
● ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయ్‌రెడ్డి నివాసంపై దాడిని ఖండించిన జర్నలిస్టులు ● ఉమ్మడి జిల్లాలో వెల్లువెత్తిన నిరసనలు ● కలెక్టర్‌కు వినతిపత్రం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : ‘సాక్షి’దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనుంజయ్‌రెడ్డి నివాసంపై ఆంధ్రప్రదేశ్ పోలీసుల దాడిని నిరసిస్తూ గురువారం ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా పలు చోట్ల జర్నలిస్టులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నల్లబ్యాడ్జీలు ధరించి ఏపీ పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు. సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నా కార్యక్రమంలో పలు యూనియన్‌ల నాయకులు, వివిధ మీడియాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు పాల్గొని..ఆంధ్రప్రదేశ్ పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే (ఐజే యూ) జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి మాట్లాడుతూ... ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎడిటర్ నివాసంలోకి చొరబడటం అప్రజాస్వామికమన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకుని పత్రికా స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. ప్రజాస్వామ్య వాదులందరూ ఈ చర్యను ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి చర్యలు పునరావృతమైతే జర్నలిస్టులు ఉద్యమిస్తారని హెచ్చరించారు. టీయూడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యదర్శి దండు ప్రభు మాట్లాడుతూ...ఎడిటర్ నివాసంపై దాడి చేయడం పత్రికల గొంతునొక్కడమే అవుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంఘం ఉపాధ్యక్షుడు సిద్దిక్, టీయూడబ్ల్యూజేఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు టి.డేవిడ్, జర్నలిస్టు నాయకులు ఇస్లావత్ శ్రీనివాస్, నాగరాజు, శివస్వామి, భీంరాజు, సుధీర్‌గౌడ్, భీంరావు, హరి, సంతోష్, సందీప్, సాక్షి బ్యూరోఇన్‌చార్జి పి.బాలప్రసాద్, ఫొటోగ్రాఫర్ శివప్రసాద్, ఆర్సీ ఇన్‌చార్జి రాజశేఖర్, రిపోర్టర్లు రామలింగు బాలయ్య, ప్రశాంత్‌గౌడ్, నవాజ్, సాక్షి టీవీ కెమెరా జర్నలిస్టు నవీన్ పాల్గొన్నారు.


