పాపన్నపేట(మెదక్): ఏడుపాయల ఆలయం వద్ద మంగళవారం స్నానం చేయడానికి వెళ్లి నీటి మునిగి భక్తుడు మృతి చెందాడు. ఏఎస్‌ఐ సంగన్న కథనం మేరకు.. సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లి చౌరాస్తాకు చెందిన బీరప్ప (45) కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఏడుపాయల వచ్చాడు. ఉదయం స్నానం చేయడానికి అక్కడి సమీపంలో ఉన్న నాగ్‌సాన్‌పల్లి ఫతేనగర్ కాల్వలోకి దిగాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు బీరప్ప నీట మునిగాడు. గమనించిన కుటుంబ సభ్యులు గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి భార్య శ్రీదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
విద్యుదాఘాతంతో సెంట్రింగ్ కూలీ..
జహీరాబాద్ టౌన్: విద్యుదాఘాతంతో సెంట్రింగ్ కూలీ మృతి చెందిన ఘటన జహీరాబాద్ పట్టణంలోని ఆర్‌ఎల్‌ఆర్ స్కూల్ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని దిడ్గి గ్రామానికి చెందిన దేవరంపల్లి నర్సింలు(30) సెంట్రింగ్ పనులు చేస్తున్నాడు. పట్టణంలోని ఆర్‌ఎల్‌ఆర్ స్కూల్ వెనుకాల భవన నిర్మాణం పనులు జరుగుతుండగా సెంట్రింగ్ పనులు చేస్తున్నాడు. ఇనుప రాడ్లను భవనం పైకి తీసుకెళ్తున్న క్రమంలో పైనుంచి వెళ్లిన 11 కేవీ కరెంట్ లైన్‌కు తాకింది. దీంతో కరెంట్ షాక్ తగిలి కింద పడ్డాడు. వెంటనే జహీరాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో అంబులెన్స్‌లో సంగారెడ్డి తీసుకెళ్తుండగా మృతి చెందాడు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు
వట్‌పల్లి(అందోల్): గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన అందోలు మండల పరిధిలోని చింతకుంట గ్రామ శివారులో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్‌ఐ పాండు కథనం మేరకు.. జోగిపేట పట్టణానికి చెందిన పెద్దబోయిన సాయి(25) బైక్‌పై మంగళవారం రాత్రి చింతకుంట నుంచి జోగిపేటకు వస్తున్నాడు. మార్గమధ్యలో గుర్తు తెలియని వాహనం బైక్‌ను వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాయికుమార్‌కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఏడుపాయల్లో నీట మునిగి వ్యక్తి మృతి