చినబాబు నడిస్తే.. జనం చూస్తారా?

Will TDP Disappear Completely In Nellore District - Sakshi

సింహపురి జిల్లాలో పచ్చ పార్టీ పూర్తిగా కనుమరుగు కానుందా? ఇప్పటికే నిర్వీర్యంగా మారిన టీడీపీ పతనం జిల్లాలో పరిపూర్ణం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయనే టాక్ నడుస్తోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం సక్సెస్ అయింది. ప్రభుత్వానికి లభిస్తున్న ప్రజాదరణ చూసి టీడీపీ నేతలు ప్రజల్లోకి వెళ్ళేందుకు జంకుతున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దయనీయంగా మారిన నెల్లూరు జిల్లా టీడీపీ స్టోరీ ఇప్పుడు చూద్దాం.

బాబుకు మిగిలింది సున్నా
గత అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. మొత్తం పది అసెంబ్లీ సీట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలుచుకుంది. ప్రజా తీర్పుతో జిల్లాలో టీడీపీ అడ్రస్ గల్లంతైంది. ప్రతిపక్ష పాత్ర కూడా పోషించలేని దయనీయ స్థితికి దిగజారిపోయింది పచ్చపార్టీ. పార్టీలకతీతంగా సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమంతో టీడీపీ చేవ చచ్చిపోయింది. ప్రజా పోరాటాలు కూడా చేసే అవకాశం, అవసరం కూడా లేకపోవటంతో తెలుగు తమ్ముళ్లు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ఆలోచిస్తున్నారు.

అధినేత ఆదేశించినప్పుడు ఇష్టం లేకపోయినా అరగంట హడావుడి చేయటం మినహా కొన్నేళ్ళుగా టీడీపీ చేస్తన్నదేమీ లేదు. చిత్తశుద్ధి లేని కార్యక్రమాలతో ఉన్న కొద్దిపాటి సానుభూతి కూడా టీడీపీ కోల్పోయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ స్థాయి ఏంటో ప్రజలు నిరూపించారు. చిత్తశుద్ధి లేని పోరాటాలతో జనం చీత్కారాలకు గురవుతూ ఉన్న కొద్దిపాటి సానుభూతిని కూడా కోల్పోయారు టీడీపీ నేతలు. జిల్లా పరిషత్లో అలాగే నెల్లూరు కార్పొరేషన్ లోనూ ఒక్కస్థానాన్ని కూడా గెలిపించుకోలేక పోయారు టీడీపీ నేతలు. దీంతో పెద్ద పెద్ద నాయకులం అనుకునేవారంతా తెరవెనక్కు వెళ్లిపోయారు .

చెప్పాడు.. చేశాడు..
మూడేళ్ళ పాటు పార్టీలకతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సీఎం వైఎస్ జగన్ సంక్షేమ ఫలాలను నేరుగా ఇళ్లకే చేరవేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యేలు నిర్వహిస్తున్న గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంతో ప్రజలకు మరింతగా చేరువయ్యారు. ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తూ..పొరపాట్లను సరిదిద్దేలా చర్యలు తీసుకుటున్నారు ఎమ్మెల్యేలు. నేతలు నిత్యం జనంలో ఉండటంతో పార్టీ క్యాడర్ లో కూడా నూతనోత్సహం కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్ధులని ప్రచారానికి రానివ్వబోమంటూ అడ్డుకొన్న గ్రామాల్లో ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఘనస్వాగతం లభిస్తోంది. ఊహించని సంక్షేమం ఓట్లు వేయక పోయినా ,  టీడీపీ సానుభూతి పరులని తెలిసినా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ ఫలాలు అందిస్తుండటంతో ఎమ్మెల్యేలకు బ్రహ్మరధం పడుతున్నారు . మంగళ హారతులిచ్చి ఆశీర్వదిస్తున్నారు. నెల్లూరు నగరంలో మాజీ మంత్రి నారాయణ వంటి వారు అడ్రస్ లేకుండా పోయారు.  మరో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఈసారి పోటీ చేయరనే టాక్ నడుస్తోంది.

చినబాబు నడిస్తే.. జనం చూస్తారా?
నెల్లూరు జిల్లాలో అచేతనావస్థలోకి చేరుకొన్న పార్టీని ఎలా బతికించుకోవాలన్న మీమాంసలో పచ్చ పార్టీ అధినేత చంద్రబాబు పడిపోయారు. టీడీపీ వ్యూహకర్త రాబిన్ శర్మను రంగంలోకి దింపి జిల్లాలో కొన ఊపిరితో ఉన్న పార్టీలో జవసత్వాలు నింపేందుకు కసరత్తు చేస్తున్నారు. కొడుకు లోకేష్ పాదయాత్ర చేపట్టే నాటికి కొంతమేరైనా పార్టీని మెరుగు పరిచేందుకు పడరాని పాట్లు పడుతున్నారు టీడీపీ బాస్ చంద్రబాబు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనీసం పోటీ అయినా ఇవ్వగలిగే అభ్యర్థులను అరువు తెచ్చయినా బరిలో దింపేందుకు వెంపర్లాడుతున్నారు. మొత్తం మీద వైఎస్సార్ కాంగ్రెస్ గడపగడపకు మనప్రభుత్వం కార్యక్రమానికి వస్తున్న ప్రజాదరణ తెలుగుదేశం పార్టీ నేతల వెన్నులో వణుకు పుట్టిస్తోందన్న టాక్ నెల్లూరు జిల్లాలో సాగుతోంది.
పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com

Read latest Sakshi Special News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top