హిమాచల్‌లో పోలింగ్‌.. దృష్టి మాత్రం ‘కాంగ్రా’పైనే

Parties Special Focus On Kangra District In Himachal Elections - Sakshi

హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రమంతా పోలింగ్‌ జరుగుతోన్నా.. అందరి చూపు మాత్రం ఒక్క జిల్లాలో ఏ పార్టీకి ఓట్లు పడుతున్నాయన్నదానిపైనే ఉంది. హిమాచల్‌ రాజకీయాల్లో ఆ జిల్లా అత్యంత కీలకమని ఇప్పటికి ఎన్నో సార్లు నిరూపితమయింది. అక్కడ పాగా వేస్తే అధికారం దాదాపు ఖరారైనట్టే. మూడు దశాబ్దాలుగా ఇదే జరుగుతోంది. అందుకే ఈసారి పార్టీలు అదే రిపీట్ అవుతుందా..? అని వేచి చూస్తున్నాయి. ఈ జిల్లా చుట్టే బీజేపీ డబుల్‌ డ్రీమ్స్‌, కాంగ్రెస్‌ అగ్నిపథ్‌ స్కీమ్‌ వ్యతిరేకతను క్యాష్‌ చేసుకోవాలని భావిస్తున్నాయి. 

సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌ కాంగ్రా
హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీలో అత్యధిక సీట్లున్న జిల్లా కాంగ్రా. 15మంది ఎమ్మెల్యేలు శాసనసభకు నేతృత్వం వహిస్తున్నారు. 1993 నుంచీ కాంగ్రా జిల్లాలో అధిక సీట్లు గెల్చుకుంటున్న పార్టీయే రాష్ట్రంలో పగ్గాలు చేపడుతోంది. 15 సీట్లలో కనీసం 9 వచ్చినవారు హిమాచల్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు. 2017 ఎన్నికల్లో బీజేపీ 11 సీట్లు గెల్చుకుంది. 

అగ్నిపథ్‌ బీజేపీకి అగ్ని పరీక్ష
కాంగ్రా జిల్లాలో రాజ్‌పుత్‌ల ప్రాబల్యం ఎక్కువ. ఓబీసీలు గణనీయ సంఖ్యలో ఉన్నారు. ఏదో ఒకపార్టీ వైపు సూటిగా నిలవటం ఈ జిల్లా ప్రత్యేకత. ప్రధాని మోదీపై రాష్ట్రంలో ఆదరణ ఉన్నా.. స్థానిక బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా పెరిగిన ధరలు కమలదళాన్ని ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం కనిపిస్తోంది. సైన్యంలో ప్రవేశాలకు కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం కూడా హిమాచల్‌ ఎన్నికల్లో ప్రధానాంశం అవుతోంది. కాంగ్రాతోపాటు పక్కనున్న హమీర్పుర్, ఉనా, మండి జిల్లాల నుంచి వేల సంఖ్యలో యువత సైన్యంలో చేరుతుంటారు. ఈ నాలుగు జిల్లాలు కలిపి మొత్తం 35 అసెంబ్లీ సీట్లున్నాయి. అగ్నిపథ్ స్కీమ్‌తో సైన్యంలో ప్రవేశం తగ్గిపోతుందనే ఆందోళన హిమాచల్ వాసులకు ఉంది. విపక్షాలకిది బలమైన అస్త్రంగా మారింది.

పక్కలో తిరుగుబాటు బళ్లెం
కాంగ్రాలోని 15 స్థానాలకు 91 మంది పోటీలో ఉన్నారు. అన్ని పార్టీలకూ ఇక్కడ తిరుగుబాటు అభ్యర్థులు సమస్యగా తయారయ్యారు. ఫతేపుర్, ధర్మశాల, ఇందోరా, కాంగ్రా, దెహ్రా స్థానాల్లో బీజేపీకి తిరుగుబాటు అభ్యర్థులు తలనొప్పిగా మారారు. పార్టీ అధ్యకుడు నడ్డా, అధిష్ఠానం ఎంతగా నచ్చజెప్పినా రెబెల్స్ వెనక్కి తగ్గలేదు. మొత్తానికి 1993 నుంచీ ఒకసారి కాంగ్రెస్, మరోసారి బీజేపీకి అధిక సీట్లు ఇస్తూ వస్తోంది కాంగ్రా జిల్లా. అలాగే రాష్ట్రంలో అధికారం మారుతూ వస్తోంది.  మరి ఈసారి కాంగ్రా ఎటువైపు మొగ్గుతుందో అని పార్టీలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి.

ఇదీ చదవండి: హిమాచల్‌ ప్రదేశ్‌ పోలింగ్‌: ఈ పోలింగ్‌ బూత్‌ ప్రపంచంలోనే ఎంతో ప్రత్యేకం! 52 మంది ఓటర్లతో ఏకంగా..

Read latest Sakshi Special News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top