కందుకూరు: పంటలకు అవసరమయ్యే పోషకాలు, సేంద్రియ రూపంలో సమర్థవంతంగా అందించాలంటే పచ్చిరొట్టను బాగా అందించే పంటలను అదే పొలంలో ముందుగా వేసుకుంటే లబ్ధి పొందవచ్చని కృషి విజ్ఞాన కేంద్రం క్రిడా నిపుణుడు జి.శ్రీకృష్ణ సూచించారు. మే చివరి వారం తొలకరి వానలు పడిన వెంటనే పచ్చిరొట్ట సాగు చేసుకోవాలన్నారు. పచ్చిరొట్ట సాగుపై రైతులకు పలు సలహాలు, సూచనలు అందజేశారు.
రెండు నెలల ముందే..
తక్కువ వనరులతో బాగా పెరిగే పచ్చిరొట్ట పంటలను ప్రధాన పంటల సాగుకు సూమారు రెండు నెలల ముందే మడిలో విత్తుకోవాలి. నేలకు తగినంత సేంద్రియ పదార్ధాన్ని అందించడానికి పచ్చిరొట్ట ఎరువుల వాడకం సులువైన, చౌకై న పద్ధతి. పప్పుజాతి(లెగ్యూమ్)పైర్లు పచ్చిరొట్టకు బాగా పనికొస్తాయి. వీటిలో మినుము, అలసంద, జీలుగ, పెసర, ఉలవ, పిల్లి పెసర, జనుము, వెంపలి పైర్లు ముఖ్యమైనవి. ఈపంటలు పూత దశకు వచ్చిన సమయంలో నేలలో కలియదున్ని, ఎరువుగా ఉపయోగించుకోవడాన్ని పచ్చిరొట్ట ఎరువు అంటారు. ఈ పైరు పెరగడానికి తగినంత తేమ, నేలలో కలియదున్నిన తర్వాత మురగడానికి తగినంత నీటి వసతి ఉండాలి. వీటి వేర్ల బుడిపెలలో సూక్ష్మజీవుల ద్వారా నత్రజని స్థాపక చర్య జరుగుతుంది. నేలలో మిగిలిపోయిన మొక్కల భాగాల నుంచి అందే నత్రజని తర్వాత పైర్లకు ఉపయోగపడుతుంది. వీటిని నేలలో కలియదున్ని, బాగా నీరు పెట్టి 2నుంచి 3 వారాల పాటు మురగనివ్వాలి. ఈ సమయంలో కొన్ని హానికరమైన సేంద్రియ ఆమ్లాలు తయారవుతాయి. కనుక మురుగు నీటిని తీసేసి కొత్త నీరు అందించి, ప్రధాన పంటలను నాటుకోవాలి. పచ్చిరొట్ట ఎరువుల నుంచి విడుదలయ్యే పోషకాలు ఎంతగానో ఉపయోగపడుతాయి.
ప్రధాన పంటలకు పోషకాలు అందించే పైర్లు
మినుము, అలసంద, జీలుగ, పెసర, ఉలవ, పిల్లి పెసర, జనుము, వెంపలి
క్రిడా నిపుణుడు శ్రీకృష్ణ సలహాలు


