తమ్మీ తప్పుకో..
న్యూస్‌రీల్
కీలకంగా బీ ఫారం
15 ఏళ్లుగా.. షాద్‌నగర్ మొదట్లో మున్సిపాల్టీగా కొనసాగింది. తర్వాత పంచాయతీగా .. తిరిగి మున్సిపాలిటీగా మారింది.
నామినేషన్ల ప్రక్రియ ముగిసింది.. బుజ్జగింపుల పర్వానికి ప్రధాన పార్టీలు తెరతీశాయి.. పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేసిన ఆశావహులు బీఫారాల కోసం ఆయా పార్టీల ముఖ్య నేతలపై ఒత్తిడి తీసుకొస్తున్నారు.. ఏళ్లుగా నమ్ముకున్నా పార్టీ నుంచి గుర్తింపు దక్కక పక్క చూపులు చూస్తున్న వాళ్లకు ప్రత్యర్థి పార్టీలు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.. కొంత మంది రాత్రికి రాత్రే కండువాలు మార్చేసి.. బీ ఫారాలు దక్కించుకుంటుండగా, మరికొంతమంది రెబల్ లేదంటే స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు.
సాక్షి, రంగారెడ్డిజిల్లా/షాద్‌నగర్: మున్సిపాటీల్లో కౌన్సిలర్ల పదవి కోసం పోటీ అధికంగా ఉంది. దీంతో వార్డుల్లో ఎవరిని అభ్యర్థులుగా ఖరారు చేయాలనే అంశంపై పార్టీల ముఖ్య నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఉన్న వారిలో ఎవరైతే టికెట్‌కు అర్హులు.. ఎవరు అనర్హులని తేల్చే పనిలో నిమగ్నమయ్యాయి. పోటీ చేసిన వారి జాబితాను ముందేసుకుని ఎవరిని ఒప్పించాలి.. ఏమని చెప్పి మెప్పించాలని కసరత్తు చేస్తున్నారు. మున్సిపాలిటీలకు ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తున్న ముఖ్య నేతలు ఆయా ఆశావహులను కూర్చొబెట్టి మాట్లాడుతున్నారు. అధిష్టానం మాట వినని వాళ్లపై వేటు వేస్తున్నారు. ఇదిలా ఉంటే శనివారం నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. ఆదివారం అభ్యంతరాలను స్వీకరించి, సోమవారం పరిష్కరించనున్నారు. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ, బీ ఫారం సమర్పణ, తుది జాబితా ప్రకటన ఉండనుంది.
మెజార్టీ స్థిరాస్తి వ్యాపారులే..
జిల్లాలో ఆరు మున్సిపాలిటీలు.. 126 వార్డులు ఉనన్నాయి. మొత్తం 635 మంది బరిలో నిలిచారు. నామినేషన్ల పరిశీలనలో ఏ ఒక్కటీ తిరస్కరణకు గురి కాకపోవడం విశేషం. చేవెళ్లలో 18 వార్డుల నుంచి 78 మంది 133 నామినేషన్లు దాఖలు చేయగా, షాద్‌నగర్‌లో 28 వార్డుల నుంచి 147 మంది 244 సమర్పించారు. శంకర్‌పల్లిలో 15 వార్డుల నుంచి 85 మంది 100 నామినేషన్లు దాఖలు చేయగా, ఆమనగల్లులో 15 వార్డుల నుంచి 92 మంది 109, మొయినా బాద్‌లో 26 వార్డుల నుంచి 108 మంది 184, ఇబ్రహీంపట్నంలో 24 వార్డుల నుంచి 125 మంది 192 నామినేషన్లు అందజేశారు. ఒక్కో వార్డు నుంచి ఇద్దరు ముగ్గురు నామినేషన్లు వేయడం ప్రధాన పార్టీలకు ఇబ్బందిగా మారింది. బుజ్జగించేందుకు ఇన్‌చార్జిలు నానా తంటాలు పడుతు న్నారు. తప్పని పరిస్థితుల్లో వారు అడిగిన డిమాండ్లకు తలొంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. పురపోరుకు సిద్ధమైన మెజార్టీ అభ్యర్థులు స్థిరాస్తి వ్యాపారులే కావడం, ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకపోవడం పోటీదారులకు కలిసి వస్తోంది. కొంతమంది దీన్ని అవకాశంగా తీసుకుంటున్నారు. ప్రధాన పోటీదారు నుంచి భారీ మొత్తాన్ని డిమాండ్ చేస్తుండటం, ఇచ్చేందుకు వారు కూడా అంగీకరిస్తుండటం గమనార్హం.
పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులకు రాజకీయ పక్షాల నుంచి బీఫాం ఉండాలి. వీటిని దక్కించుకునేందుకు ఆశావహులంతా పోటీపడుతున్నారు. తమకున్న ఆర్థిక, సామాజిక బలాలను ముఖ్య నేతల ఎదుట ప్రస్తావిస్తున్నారు. బీఫారం ఎలాగైనా తమకే దక్కేలా చూడాలని స్థానిక ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జిలను అభ్యర్థిస్తున్నారు. మంత్రివర్గంలోని ముఖ్య నేతలతో జిల్లా నేతలకు ఫోన్లు చేయిస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరిరోజు మధ్యాహ్నం 3 గంటల్లోపు రిటర్నింగ్ అధికారికి బీ ఫారం అందజేయాలి. బీఫారం సమర్పించని వాళ్లను స్వతంత్ర అభ్యర్థిగా ప్రకటించనున్నారు. గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులను స్థానిక వార్డు/డివిజన్‌లోని ఒక ఓటరు, అదే స్వతంత్ర అభ్యర్థిని స్థానికంగా పదిమంది ఓటర్లు ప్రతిపాదించాల్సి ఉంది. నామినేషన్ ఫారంలో ఆస్తులు, అప్పులు, ఆదాయ మార్గాలు, అభ్యర్థి ఓటరు, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలను జత చేయాలి. వీటిలో ఏ ఒక్కటి లేక పోయినా నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల వారు కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి. నామినేషన్ ముందు రోజే బ్యాంకు ఖాతా తెరిచి ఎన్నికల ఖర్చులను దాని ద్వారా నిర్వహించాలనే నిబంధన సైతం ఉంది. అఫిడవిట్‌లో ఏ ఒక్క కాలాన్ని పూర్తి చేయకున్నా చిక్కులు తప్పవు.
బుజ్జగింపుల పర్వం షురూ
‘పుర’ బరిలో ఆశావహులు
బీ–ఫారాల కోసం పోటాపోటీ యత్నం
జాగ్రత్తలు తీసుకుంటున్న ప్రధాన పార్టీలు
నామినేషన్ల ఉపసంహరణకు ఒత్తిడి
ఒప్పించి.. మెప్పించేలా కసరత్తు
మాట వినకుంటే వేటుకు సిద్ధం
తమ్మీ తప్పుకో..
తమ్మీ తప్పుకో..


