15 ఏళ్లుగా పట్టణపాలన | - | Sakshi
Sakshi News home page

15 ఏళ్లుగా పట్టణపాలన

Feb 1 2026 10:41 AM | Updated on Feb 1 2026 10:41 AM

15 ఏళ్లుగా పట్టణపాలన

15 ఏళ్లుగా పట్టణపాలన

స్వాతంత్య్రం తొలినాళ్లలోనే

మున్సిపల్‌గా షాద్‌నగర్‌

1964లో గ్రామ పంచాయతీగా ఏర్పాటు

47 వసంతాలు కొనసాగిన

సర్పంచుల హవా

2011లో రెండోసారి

పురపాలికగా రూపాంతరం

షాద్‌నగర్‌: దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలోనే షాద్‌నగర్‌ మున్సిపాలిటీగా ఉండేది. అభివృద్ధికి నిధులు లేకపోవడంతో గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు. 47 ఏళ్ల పాటు గ్రామ పాలనే కొనసాగింది. ఈ వ్యవస్థకు నాటి ప్రభుత్వం స్వస్తి చెప్పి తిరిగి రెండోసారి మున్సిపాలిటీగా మార్చింది. ప్రస్తుతం జరిగే పుర పోరులో అధికార కాంగ్రెస్‌, విపక్షాలైన బీఆర్‌ఎస్‌, బీజేపీ తమ ఉనికిని కొనసాగించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. విజయమే లక్ష్యంగా ప్రచారానికి వ్యూహాలు రచించి, ఎన్నికల రణరంగంలోకి దిగుతున్నాయి.

చరిత్ర ఇదే..

1869 నుంచి 1911 మధ్యకాలంలో ఆరో నిజాం నవాబు మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ షాద్‌నగర్‌ను స్థాపించారు. జానంపేటకు చెందిన మహారాజా కృష్ణప్రసాద్‌ ఈ ప్రాంతాన్ని పాలించేవారు. ఈయన ‘షాద్‌’ అనే కలంతో ప్రసిద్ధి చెందారు. అందుకే షాద్‌నగర్‌గా పేరు వచ్చింది. పంచాయతీరాజ్‌ వ్యవస్థ ప్రారంభానికి ముందు 1954 ప్రాంతంలో షాద్‌నగర్‌ మున్సిపాలిటీగా ఉండేది. ఈ పట్టణ కేంద్రంగా కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ బ్లాగ్‌గా ఏర్పడింది. షాద్‌నగర్‌లో నిర్వహించిన ఎన్నికల్లో తొలి మున్సిపల్‌ చైర్మన్‌గా మాదిరాజు సుదర్శన్‌రావు ఎన్నికయ్యారు. 1959లో పంచాయతీరాజ్‌ వ్యవస్థ ఏర్పాటైంది. 1964లో షాద్‌నగర్‌ మేజర్‌ గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు.

రెండోసారి మున్సిపాలిటీగా..

నాడు అభివృద్ధికి సరిగా నిధులు లేకపోవడంతో మున్సిపాలిటీగా ఉన్న షాద్‌నగర్‌ను 1964లో ప్రభు త్వం రద్దు చేసింది. మేజర్‌ గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసి పాలనను కొనసాగించారు. 1964 నుంచి 2011 వరకు 47 ఏళ్ల పాటు గ్రామ పంచాయతీగా కొనసాగిన షాదనగర్‌ను తిరిగి 2011 ఆగస్టు 24న గ్రేడ్‌–3 మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. గత 15 ఏళ్లుగా ఇక్కడ మున్సిపాలిటీ పాలన కొనసాగుతోంది. ప్రస్తుతం ఇక్కడ 28 వార్డులున్నాయి. పట్టణ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలిచేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ఆంగ్లేయుల బానిస సంకెళ్ల నుంచి భారతావని స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న సమయంలో షాద్‌నగర్‌ పురపాలక సంఘంగా కొనసాగింది. నాటి పరిస్థితులకు తగ్గట్టు నిధులు లేకపోవడంతో అనంతరం గ్రామ పాలనలోకి వచ్చింది. హైదరాబాద్‌ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కొనసాగిన బూర్గుల రామకృష్ణారావు ఈ ప్రాంతం నుంచే ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ఆ చరిత్రేంటో ఓసారి లుక్కేద్దాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement