ఏకగ్రీవం కాకుండా బీజేపీ చెక్
శంకర్‌పల్లి: మున్సిపాలిటీలో నామినేషన్ల సమయానికే క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. 12వ వార్డు స్థానానికి బీఆర్‌ఎస్ నుంచి దండు సంతోష్, కాంగ్రెస్ నుంచి యంసాని ప్రకాశ్ గుప్తా నామినేషన్ దాఖలు చేశారు. ఆఖరి నిమిషంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి సంతోష్ తండ్రి రాజేశ్వర్ కాంగ్రెస్ కండువా కప్పుకొని నామినేషన్ వేశారు. అప్పటికే హస్తం పార్టీ నుంచి బరిలో ఉన్న ప్రకాశ్‌గుప్తా సైతం రాజేశ్వర్‌తో కలిసి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వెంటనే అప్రమత్తమైన బీజేపీ నాయకులు వార్డు స్థానాన్ని ఏకగ్రీవం కాకుండా సిరిగన్నగారి శ్రీకాంత్‌రెడ్డిని బరిలో నిలిపి, ఆయన్ని నగరంలోని క్యాంపునకు తరలించారు. ఫిబ్రవరి 3వ తేదీ వరకు అక్కడే ఉంచనున్నట్లు సమాచారం.
మహిళ అదృశ్యం
మొయినాబాద్ రూరల్: ఇంటి నుంచి పని కోసం వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెడ్డిపల్లి గ్రామానికి చెందిన కుండే ప్రవళిక స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తుంది. ఈ క్రమంలో శుక్రవారం ఆస్పత్రికి పని కోసం వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ వచ్చింది. సాధ్యమైన అన్ని ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో ఆమె భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కల్తీ కోవా పట్టివేత
ఇద్దరి అరెస్టు
తాండూరు టౌన్: ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కల్తీ కోవా తయారు చేసి విక్రయిస్తున్న ఇద్దరిని జిల్లా టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం రాత్రి పట్టుకున్నారు. టాస్క్‌ఫోర్స్ సీఐ అన్వర్‌పాషా తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు పట్టణంలో కల్తీ కోవా విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం రావడంతో ఓ వ్యక్తి ఇంట్లో సోదాలు చేశారు. కల్తీ కోవా ఉండటంతో స్వాధీనం చేసుకున్నారు. పట్టణానికి చెందిన ప్రకాష్ విష్ణు అనే వ్యక్తి హైదరాబాద్ చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన మహ్మద్ సల్మాన్ వద్ద కల్తీ కోవా తెచ్చి పలు స్వీటు షాపులకు విక్రయిస్తుంటాడు. ప్రకాష్ విష్ణు ఇంటిపై దాడి చేయగా 120 కిలోల కల్తీ కోవా దొరికిందన్నారు. హైదరాబాద్‌లో మహ్మద్ సల్మాన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఇద్దరిని అరెస్టు చేసి పట్టణ పోలీసులకు అప్పగించామన్నారు.
భవనంపై నుంచి జారిపడి వాచ్‌మెన్ మృతి
గచ్చిబౌలి: భవనంపైనుంచి జారిపడిన ఓ వాచ్‌మెన్ మృతి చెందాడు. ఈ సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ బాలరాజు తెలిపిన మేరకు.. కొండాపూర్ రాజరాజేశ్వరీనగర్‌లో నివాసముండే అడబాల శ్రీనివాస్(29) ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. శుక్రవారం డ్యూటీకి వెళ్లి తిరిగి రాలేదు. కుమారుడు సత్యనారాయణ అపార్ట్‌మెంట్ ప్రాంతంలో గాలించగా సెల్లార్‌లో పడిపోయి తలకు, కాళ్లకు తీవ్ర గాయాలైనట్లు గుర్తించాడు. సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే శ్రీనివాస్ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఏకగ్రీవం కాకుండా బీజేపీ చెక్


