ముగ్గురు దొంగల రిమాండ్‌ | Sakshi
Sakshi News home page

ముగ్గురు దొంగల రిమాండ్‌

Published Wed, Mar 29 2023 4:02 AM

నిందితుడు బహదూర్‌  - Sakshi

యాచారం: కందుకూరు మండలం మీరాఖాన్‌పేట, యాచారం మండలం కుర్మిద్ద గ్రామాల్లో బైక్‌, ఆటోల దొంగతనాలను పాల్పడిన ముగ్గురిని యాచారం పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. శంషాబాద్‌ మండలం మదనాపల్లెకి చెందిన శ్యామ్‌, శివకుమార్‌, శ్రీ చరణ్‌ ఆదివారం రాత్రి మీరాఖాన్‌పేటలో ఒక బైక్‌ను, కుర్మిద్ద గ్రామంలో ఆటోను తరలిస్తుండగా ఆయా గ్రామాల ప్రజలు పట్టుకుని పోలీసులకు అప్పగించిన విషయం తెలిసిందే. నిందితులపై గతంలో పలు కేసులు ఉన్నట్లు ఎస్‌ఐ ప్రసాద్‌ తెలిపారు.

బంగారం పట్టివేత

ఇద్దరు ప్రయాణికుల నుంచి కిలో బంగారం స్వాధీనం

శంషాబాద్‌: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు వేర్వేరు ప్రయాణికులు అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఉదయం దుబాయ్‌ నుంచి ఈకే–524 విమానంలో వచ్చిన ప్రయాణికుడి కదలికలను అనుమానించిన అధికారులు అతడిని తనిఖీ చేశారు. మలద్వారంలో బంగారం తీసుకొచ్చినట్లు తేలడంతో అతడికి శస్త్రచికిత్స చేయించి మూడు బంగారు క్యాప్సుల్స్‌ను బయటకి తీశారు. 840 గ్రాముల బరువు కలిగిన బంగారం విలువ రూ. 51.24 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఆయిల్‌ డబ్బాల్లో

దుబాయ్‌ నుంచి వచ్చిన మరో ప్రయాణికుడిని తనిఖీ చేయగా అతడు ట్యూనాఫిష్‌ ఆయిల్‌ తీసుకొచ్చిన టిన్‌ డబ్బాలో 233 గ్రాముల బంగారం బయటపడింది. దీని విలువ రూ. 14.23 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

పెట్టుబడి పేరుతో

రూ. 28లక్షలు స్వాహా

హిమాయత్‌నగర్‌: టెలిగ్రామ్‌ ద్వారా పరిచయమైన సైబర్‌ నేరగాళ్లు నగర యువకుడికి భారీగా టోకరా వేశారు. పార్ట్‌టైం జాబ్‌ పేరుతో గాలం వేసి పరిచయం పెంచుకున్నారు. జాబ్‌తో పాటు ఇన్వెస్ట్‌ చేయాలని కోరారు. తొలిరోజుల్లో చేసిన పెట్టుబడులకు కొద్దిపాటి లాభాలు ఇచ్చి నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ఆ తర్వాత పెట్టిన పెట్టుబడికి లాభాలు ఇవ్వకపోగా టాస్క్‌లు పూర్తి చేస్తే ఇస్తామన్నారు. ఇలా పలు దఫాలుగా బాధితుడి నుంచి రూ.28లక్షలు నుంచి కాజేశారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ మంగళవారం అతను సిటీ సైబర్‌క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను కలిసి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

లైంగిక దాడి కేసులో

నిందితుడికి 20 ఏళ్ల జైలు

నాగోలు: బాలికపై లైంగికదాడికి పాల్పడిన కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ. 25 వేల జరిమానా విధిస్తూ మంగళవారం రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టు తీర్పు తీర్పు చెప్పింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎల్‌బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని హస్తినాపురం, దేవకమ్మ తోట వద్ద బనబాసి నహక్‌ అలియాస్‌ బహదూర్‌ (50) వాచ్‌మెన్‌గా పనిచేసేవాడు. సమీపంలో ఇంట్లో ఓ కుటుంబం నివాసం ఉండేది. 2017 జనవరి 1న తల్లిదండ్రులు పనికి వెళ్లగా ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై బహదూర్‌ లైంగిక దాడికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. ఆధారాలను పరిశీలించిన న్యాయస్ధానం మంగళవారం నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.25 వేలు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. బాధితురాలికి ప్రభుత్వం రూ. 6 లక్షలు పరిహారం అందజేసింది.

Advertisement
Advertisement