● ఖర్దుంగ్‌లా ఛాలెంజ్‌లో 72 కిలోమీటర్ల పరుగు పూర్తి చేసిన ఏఆర్ కానిస్టేబుల్ ● అనిల్‌కు రాజన్న సిరిసిల్ల ఎస్పీ మహేశ్‌బిగీతే అభినందన
సిరిసిల్ల: ‘ఖర్దుంగ్ లా పర్వత మార్గం నా శారీరక, మానసిక సామర్థ్యాలకు కఠినమైన పరీక్షగా నిలిచింది. ప్రతీ అడుగు నా పరిమితులను పరీక్షించినప్పటికీ నా ఆత్మస్థైర్యాన్ని మాత్రం ఓడించలేకపోయింది. ఎన్ని సవాళ్లు ఎదురైనా లక్ష్యాన్ని చేరుకోవాలనే సంకల్పంతో ముందుకు సాగి 72 కిలోమీటర్ల పరుగును పూర్తి చేశా..’ అని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ అనిల్ అన్నారు. లడక్‌లో 17,618 అడుగుల ఎత్తులో నిర్వహించిన ఖర్దుంగ్ లా చాలెంజ్‌లో 72 కిలోమీటర్ల అల్ట్రా మారథాన్ పరుగును అనిల్ 13 గంటల 23 నిమిషాల 54 సెకన్లలో.. మరుసటి రోజు లాడక్ మర్థన్ 42.2 కిలోమీటర్ల రన్‌ను ఎముకలు కొరికే చలిలో పూర్తి చేశారు. అనిల్‌ను ఎస్పీ మహేశ్ బి గితే మంగళవారం సిరిసిల్లలో అభినందించారు. సముద్ర మట్టానికి 17,618 అడుగుల ఎత్తులో అత్యంత కఠినమైన కొండ ప్రాంతాలు, తీవ్రమైన చలి వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ పట్టుదల, ఆత్మవిశ్వాసంతో లక్ష్యాన్ని పూర్తి చేయడంపై పలువురు అభినందించారు. ప్రజాసేవలో నిరంతరం విధులు నిర్వర్తిస్తూనే ఇటువంటి ప్రతిష్టాత్మక ఈవెంట్లలో పాల్గొంటూ విజయాలు సాధించడం ద్వారా పోలీస్ ఫోర్స్‌లోని యువ సిబ్బందికి అనిల్ ఆదర్శంగా నిలిచారని ఎస్పీ పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఇటువంటి పోటీల్లో మరింత ప్రావీణ్యం సంపాదించి, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.


