● సైన్‌బోర్డ్స్ ఏర్పాటు చేయాలి ● కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల: రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని డీఆర్‌ఎస్‌సీ చైర్‌పర్సన్, కలెక్టర్ గరీమా అగ్రవాల్ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో గురువారం జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో మాట్లాడారు. ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్టీసీ బస్ డ్రైవర్లకు అవగాహన తరగతులు పెట్టాలన్నారు. సైన్‌బోర్డులు, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయించాలని, రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరిగే ప్రాంతంలో ఆర్‌అండ్‌బీ, రవా ణా, పోలీస్ అధికారులు పరిశీలించి నివారణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్లపైకొచ్చే చెట్ల కొమ్మలు తొలగించాలని సూచించారు. నెల రోజుల్లో డ్రంకెన్‌డ్రైవ్ కింద 1,072, ఎంవీఐ యాక్ట్‌లో 449 కేసులు నమోదు చేశామని, 30 రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందగా, 23 మంది గాయపడ్డారని పోలీసు అధికారులు వెల్లడించారు. రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన సిరిసిల్లకు చెందిన ఆటోడ్రైవర్ పోసు శ్రీనివాస్ రూ.25వేలు ఆర్థిక సహాయానికి రహవీర్‌లో ఎంపికై నట్లు తెలిపారు. ఆర్‌అండ్‌బీ ఈఈ భీమ్లానాయక్, జిల్లా రవాణా అధికారి శ్రీనివాస్, పీఆర్ ఈఈ సుదర్శన్‌రెడ్డి, రోడ్డు భద్రత కమిటీ సభ్యుడు సంగీతం శ్రీనాథ్, ఎస్‌బీ డీఎస్బీ జి.వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్‌పాషా, లోకేశ్ పాల్గొన్నారు.
స్వచ్ఛత పనులపై శ్రద్ధపెట్టాలి
స్వచ్ఛత పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం స్వచ్ఛత హీ సేవ–2026 పోస్టర్లను ఆవిష్కరించారు. రద్దీ ఉండే ఆలయాలు, బస్టాండ్లు, మార్కెట్లు, వీవో భవనాలు, అంగన్‌వాడీల్లో మరుగుదొడ్లు నిర్మించాలని సూచించారు. స్వచ్ఛత హీ సేవలో ఈనెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు పరిశుభ్ర గ్రామాలుగా తీర్చిదిద్దుకోవాలని కోరారు. డీఆర్డీవో లక్ష్మీనారాయణ, మిషన్ భగీరథ ఈఈలు అన్వర్, సుమలత, డీఏవో అఫ్జల్‌బేగం, ఎస్‌బీఎం సురేశ్ పాల్గొన్నారు.
వృద్ధులకు సహాయ ఉపకరణాలు పంపిణీ
రాష్ట్రీయ వయోశ్రీ యోజన ద్వారా అర్హులైన వృద్ధులకు సహాయ ఉపకరణాలు అందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 3,521 మందికి రూ.2.90 కోట్లతో 16,631 సహాయ పరికరాలు మంజూరైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా కొందరికి ఉపకరణాలు అందించారు. జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు.


