కనిపించని వాచ్‌టవర్.. సఫారీ జాడ కరువు క్యాంటీన్.. సైక్లింగ్ లేవు 150 ఎకరాల్లో రూ.3 కోట్లతో అర్బన్ పార్క్ నిధులిస్తేనే పర్యాటక అభివృద్ధి
సిరిసిల్ల: పాలకులు మారితే.. అభివృద్ధి ప్రాధాన్యాలు మారిపోతుంటాయి. ప్రజల ప్రయోజనాలను సైతం పక్కనపెట్టేస్తుంటారు. ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది సిరిసిల్ల ఫారెస్ట్ అర్బన్(ఆక్సిజన్) పార్క్. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన బడి పిల్లలకు విజ్ఞానం, పట్టణ వాసులకు వికాసాన్ని అందించే అర్బన్ పార్క్ నిర్లక్ష్యానికి గురవుతుంది. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్–హరిదాస్‌నగర్ మధ్య 150 ఎకరాలలో రూ.3కోట్లతో ఫారెస్ట్ అర్బన్ పార్క్‌ను అభివృద్ధి చేయగా.. వసతుల కల్పనలో పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. అభివృద్ధికి నోచుకోని సిరిసిల్ల అర్బన్‌పార్క్‌పై నిర్లక్ష్యపు నీడపై శ్రీసాక్షిశ్రీ ఫోకస్.
వాచ్ టవర్.. సఫారీ జీపు ఏది?
సిరిసిల్ల పట్టణ పరిధి సర్ధాపూర్ వరకు విస్తరించి ఉండడంతో అక్కడి నుంచి మరో ఐదు కిలోమీటర్ల దూరంలోని ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ – హరిదాస్‌నగర్ అటవీ ప్రాంతంలో అర్బన్ పార్క్‌ను ఏర్పాటు చేశారు. అక్కడ 1250 ఎకరాల్లో అడవి విస్తరించి ఉంది. ఇందులో 150 ఎకరాల్లో అర్బన్ పార్క్‌ను గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేశారు. ఇక్కడ అడవి అందాలను వీక్షించేందకు వాచ్ టవర్ నిర్మాణానికి ప్రతిపాదించారు. అడవి దారిలో ప్రయాణించే రక్షిత వాహనం(సఫారీ) ఏర్పాటు చేస్తే అడవి అంతా తిరిగి అవకాశం దక్కుతుంది. కానీ వాచ్ టవర్ నిర్మాణం, సఫారీ వాహనాన్ని సమకూర్చలేదు. మూడు వాచ్ టవర్లు, ఇతర వసతుల కోసం రూ.3కోట్లతో చేసిన ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి. పిల్లల కోసం ఓ పది సైకిళ్లను అందుబాటులో ఉంచితే వాటిపైన చక్కర్లు కొట్టే అవకాశం ఉంటుంది. ఛాయ్, బిస్కెట్లతో కూడిన క్యాంటీన్ గది కూడా లేదు. ఇక్కడ పనిచేసే వాచర్‌కు జీతం ఇవ్వడం లేదు.
ఆకట్టుకుంటున్న అందాలు
అర్బన్‌పార్క్‌లోకి వెళ్లేందుకు వీలుగా ప్రాకారంతో కూడిన రోడ్డు వేశారు. పూలమొక్కలు, ఆట వస్తువులు, ధ్యానమందిరం ఏర్పాటు చేశారు. సేదతీరేందుకు కుర్చీలు, బెంచీలు ఉన్నాయి. అర్బన్‌పార్క్‌లోకి ప్రవేశించగానే... స్వాగతం పలికే నెమలి, ఏ, బీ, సీ, డీ, ఎఫ్ అక్షరాలతో కూడిన దారి, రాకాసిబల్లి, కొంగలు, అడవిలో విహరించే పులిబొమ్మ, సీతాకోక చిలుకలతో అర్బన్‌పార్క్ ఆకట్టుకుంటోంది. తాగునీటి వసతి, టాయిలెట్స్, పిల్లల పార్క్‌లను ఏర్పాటు చేశారు.
ఔషధ మొక్కల నిలయం
అర్బన్ పార్క్‌లో ఇప్పటికే ఉన్న వృక్షాలు, మొక్కలకు తోడుగా ఖాళీ ప్రదేశాల్లో ఔషధ మొక్కలను, నక్షత్ర వనాలు, రాశివనాలను పెంచారు. హెర్బల్ గార్డెన్, అడ్వెంచర్ టెక్కింగ్‌కు అవసరమైన పరికరాలు ఏర్పాటు చేస్తున్నారు. అటవీ ప్రాంతంలోని చెట్లు వాటి చరిత్రను పిల్లలకు వివరించేందుకు వీలుగా మొక్కల చరిత్రను రాయనున్నారు. నీటినిల్వ కోసం ఊటకుంట నిర్మించారు. చుట్టూరా పూలమొక్కలతో గార్డెన్లు ఏర్పాటు చేశారు. కుంట మధ్యలోకి వెళ్లేందుకు వంతెన నిర్మించారు.
అర్బన్ పార్క్‌లో రాకాసి బల్లి బొమ్మ
అర్బన్ పార్క్‌లో నీటి కుంట, మధ్యలోకి వెళ్లేందుకు వంతెన
అభివృద్ధి పనులకు ప్రతిపాదించాం
అర్బన్ పార్క్‌లో వాచ్‌టవర్‌కు రూ.20లక్షలు, సఫారీ వాహనానికి రూ.10లక్షలు, క్యాంటీన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాం. వన్యప్రాణు ల కోసం సోలార్ బోర్లు వేయాల్సి ఉంది. వాటికి ఇంకా మంజూరు కాలేదు. ఆదివారాల్లో ఎక్కువ సందర్శకులు వస్తున్నారు. గత నెలలో 362 మంది వచ్చారు. పిల్లలకు రూ.10, పెద్దలకు రూ.20 రుసుం పెట్టాం. సఫారీ ఉంటే మరింత మంది పర్యాటకులు, స్కూల్ పిల్లలు వస్తారు. వనదర్శిని పేరిట పిల్లలకు ప్రవేశ రుసుంలో రాయితీ ఇస్తున్నాం. అడవి అందాలను ఆసక్తిగా వీక్షిస్తున్నారు.
– ఎన్.మోహన్‌లాల్, డిప్యూటీ రేంజ్ అధికారి, సిరిసిల్ల


