సిరిసిల్ల: జిల్లావ్యాప్తంగా సోమ, మంగళవారాల్లో వర్షం దంచికొట్టింది. వినాయక చవితి రోజు తెల్లవారుజామునే భారీ వర్షం కురవగా.. మంగళవారం తెల్లవారుజామున ఓ మోస్తారు వర్షం కురిసింది. ఇల్లంతకుంటలో అత్యధికంగా 16.2 మిల్లీ మీటర్ల వర్షం పడగా.. రుద్రంగిలో 4.7, చందుర్తిలో 5.7, వేములవాడ రూరల్‌లో 6.6, బోయినపల్లిలో 7.4, వేములవాడలో 9.0, సిరిసిల్లలో 8.6, కోనరావుపేటలో 6.9, వీర్నపల్లిలో 5.8, ఎల్లారెడ్డిపేటలో 12.6, గంభీరావుపేటలో 8.0, ముస్తాబాద్‌లో 11.8, తంగళ్లపల్లిలో 12.1 మిల్లీ మీటర్ల వర్షం పడింది. వర్షాలతో సిరిసిల్ల మానేరు వాగు, వేములవాడ మూలవాగుల్లో ప్రవాహం పెరిగింది. సిరిసిల్ల పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నేతన్న చౌక్, పాత బస్టాండు ఏరియా వర్షం నీటితో నిండిపోయాయి. జిల్లా అంతటా వర్షం పడడంతో పత్తి, వరి పంటలకు ప్రాణం పోసినట్లు అయింది. రెండు రోజుల పాటు మంచి వర్షాలు పడ్డాయి.


