సిరిసిల్ల: జిల్లాలో చేయూత సామాజిక భద్రత పెన్ష న్ల కొత్త దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పారదర్శకంగా పరిశీలించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం అధికారులతో ఆమె సమీక్షించారు. బుధవారం నుంచి ఈనెల 25 వరకు పెన్షన్ దరఖాస్తుల క్షేత్రస్థాయిలో ప్రభుత్వం నిర్దేశించిన అర్హత ప్రమాణాల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. డీఆర్డీవో లక్ష్మీనారాయణ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ హిమశ్రీ, చేనేత, జౌళిశాఖ ఏడీ సంతోశ్‌కుమార్, డీఎంహెచ్‌వో ఏంజెలా ఆల్ఫ్రెడ్ తదితరులు పాల్గొన్నారు.
భూముల రీసర్వే పూర్తి చేయాలి
భూముల రీసర్వేను రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్‌తో కలిసి సమీక్షించారు. ప్రభుత్వ శాఖల భూముల వివరాలను సంబంధిత శాఖల అధికారులకు అందజేయాలన్నారు.
ఆయిల్ పామ్ సాగువైపు ప్రోత్సహించాలి
జిల్లాలో ఆయిల్ పాం సాగుతో వచ్చే లాభాలు, ప్రభుత్వ సబ్సిడీపై రైతులకు అవగాహన కల్పిస్తూ సాగు వైపు ప్రోత్సహించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. కలెక్టరేట్‌లో ఉద్యాన వనాల శాఖ అధికారులతో ఆమె సమీక్షించారు. ఈ ఏడాది జిల్లాలో 709 ఎకరాలకు డ్రిప్ ఆమోదించగా, 502 ఎకరాలలో ఆయిల్ పామ్ మొక్కలు నాటించామని, ఈ వారంలో 143 టన్నుల దిగుబడి రాగా, రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.35 లక్షలు జమ అయ్యాయని అధికారులు వివరించారు. జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్‌బాబు, జిల్లా వ్యవసాయ అధికారి అ ఫ్జల్ బేగం, ఉద్యానవన అధికారులు పాల్గొన్నారు.
కోడెల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి
వేములవాడఅర్బన్: తిప్పాపూర్‌లోని గోశాలలో కోడెల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ గరీమ అగ్రవాల్ అన్నారు. కోడెల పంపిణీ ఆనంతరం గోశాలలోని షెడ్లను పరిశీలించి ఎండు, పచ్చి గడ్డి దానాపై ఆరా తీశారు.


