నోటీసులు అందినా స్పందించని ఓటర్లు విచారణకు హాజరు కాని వైనం! ఉమ్మడి జిల్లాల్లో 6.94 లక్షల నోటీసులు డెలివరీ కాని నోటీసులు 81,541 ల్యాప్స్ అయిన హియరింగ్‌లు 3.21 లక్షలు
సాక్షి,పెద్దపల్లి: ఉమ్మడి జిల్లాలో సర్ నోటీసులు జారీ అవుతున్నా విచారణ ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. నోటీసులు అందుకున్నవారు నిర్ణీత తేదీల్లో హియరింగ్‌కు హాజరు కావడంలేదు. కేటాయించిన తేదీలు గడిచిపోవడం.. రీషెడ్యూల్ చేయాల్సి రావడం వంటి పరిణామాలతో ెపెండింగ్ కేసులు పెరుగుతున్నాయి. ఆదివారం వరకు కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో కలిపి 6,94,517 సర్ నోటీసులు జనరేట్ కాగా.. ఇందులో 6,12,976 డెలివరీ చేశారు. 81,541 నోటీసులు డెలివరీ కాలేదు. మరో వైపు హియరింగ్ తేదీల్లో గైర్హాజరు కావడంతో 3.21 లక్షలకుపైగా నోటీసులు ల్యాప్స్ అయ్యాయి. నిర్దేశిత గడువులోగా ఎంతదరు విచారణకు హాజరవుతారు? ఎంతమంది గైర్హాజరవుతారనేది కీలకంగా మారింది.
నోటీసులు అందినా.. హాజరు ఎక్కడ?
నోటీసు డెలివరీ పూర్తయ్యాక సదరు వ్యక్తికి హియరింగ్ తేదీ కేటాయిస్తారు. ఆ తేదీన హాజరు కాకపోతే అది ల్యాప్స్ అవుతుంది. అదేఅంశంపై మరోసారి తేదీ కేటాయించాల్సి వస్తోంది. ఇప్పటికే పెద్దసంఖ్యలో నోటీసులు జారీ అయిన నేపథ్యంలో ఇలాంటి గైర్హాజరీలు పెరిగితే హియరింగ్ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా కరీంనగర్, జగిత్యాలలో విచారణకు ఓటర్లు గైరాజరవుతున్నారు.
కారణాలు అనేకం.
హియరింగ్ తేదీలు ల్యాప్స్ కావడానికి ప్రధానంగా నోటీసుల డెలివరీలో జాప్యం ఒక కారణంగా కనిపిస్తోంది. నోటీసు అందిన తర్వాతే సంబంధిత వ్యక్తి విచారణకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. భారీ సంఖ్యలో నోటీసులు ఉండటంతో ప్రతీదానిని నిర్ణీత సమయంలో డెలివరీ చేయకపోవడం, నోటీసు అందుకునే సమయానికి విచారణ తేదీ ముగిసిపోవడం, లేదా తక్కువ సమయం ఉండటం ప్రధాన కారణంగా తెలుస్తోంది. అలాగే నోటీసులు అందుకున్న వారు స్థానికంగా కాకుండా హైదరాబాద్ తదితర దూరప్రాంతాల్లో ఉండటం కూడా హియరింగ్‌కు హాజరుకావడం లేదంటున్నారు. ఒకవేళ గడువురోజు హాజరైనా పరిమిత సంఖ్యలో సిబ్బంది ఉండటం, వచ్చిన వారు అధిక సంఖ్యలో ఉండటంతో చాలామంది విచారణకు హాజరుకాకుండానే వెనుతిరుగుతున్నారు.
విచారణకు హాజరు పెంచడమే కీలకం
నోటీసులు జారీచేయడంపైనే అధికార యంత్రాంగం దృష్టి సారిస్తోంది. నోటీసు అందుకున్న వారు నిర్ణీత తేదీన విచారణకు హాజరై తమ వాదనలు, ఆధారాలు సమర్పించినప్పుడే ప్రక్రియ ముందుకు సాగుతుంది. ఈ నేపథ్యంలో హియరింగ్ తేదీ, సమయం, వేదికపై స్పష్టమైన సమాచారం అందించడం, గైర్హాజరైన వారికి వెంటనే తదుపరి తేదీ కేటాయించడం, పెండింగ్ కేసులపై ప్రత్యేక పర్యవేక్షణ అవసరం. లేకపోతే ఒకే కేసుకు పదేపదే తేదీలు కేటాయించే పరిస్థితి ఏర్పడి.. ఇప్పటికే ఉన్న పెండింగ్ తేదీలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఉమ్మడి జిల్లా సర్ నోటీసుల సమాచారం
జిల్లా జారీ డెలీవరి పెండింగ్ విచారణపూర్తి ల్యాప్స్
కరీంనగర్ 2,70,190 2,29,052 41,138 82,773 1,24,386
పెద్దపల్లి 1,47,518 1,30,616 16,902 23,107 55,837
సిరిసిల్ల 83,846 76,211 7,635 27,297 38,619
జగిత్యాల 1,92,963 1,77,097 15,866 47,652 1,02,203


