పాఠశాల స్థాయిలోనే దృష్టి లోపాలు గుర్తించాలి | - | Sakshi
Sakshi News home page

పాఠశాల స్థాయిలోనే దృష్టి లోపాలు గుర్తించాలి

Sep 16 2026 8:46 AM | Updated on Sep 16 2026 8:46 AM

సిరిసిల్ల: పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల్లో ఉన్న దృష్టిలోపాలను గుర్తించి వైద్యసేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ ఏంజెలా ఆల్ఫ్రెడ్‌ కోరారు. సిరిసిల్లలోని మైనార్టీ బాలిక గురుకుల విద్యాలయంలో మంగళవారం నిర్వహించిన కంటి వైద్యశిబిరంలో మాట్లాడారు. విద్యార్థులు కంటి ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండాలని, నేత్ర సంబంధిత సమస్యలను గుర్తించడం ద్వారా భవిష్యత్‌లో తీవ్రమైన దృష్టి సమస్యలను నివారించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అంధత్వ నియంత్రణ అధికారి డాక్టర్‌ నయీమ్‌ జహా, ఆర్‌బీఎస్‌కే వైద్యాధికారి డాక్టర్‌ గౌస్‌ బాషా, డాక్టర్‌ ప్రమోద, పాఠశాల ప్రిన్సిపాల్‌ వురూసా ఫాతిమా, ఆప్టోమెట్రిస్ట్‌ రాజేందర్‌, పారా మెడికల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

గణేశ్‌ నిమజ్జన ప్రదేశాలు పరిశీలన

సిరిసిల్ల: జిల్లా కేంద్రంలో గణేశ్‌ నిమజ్జన వేడుకలు నిర్వహించే ప్రదేశాలను సిరిసిల్ల ఆర్డీవో శ్రీధర్‌బాబు, డీఎస్పీ నాగేంద్రాచారిలు మున్సిపల్‌ అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. విద్యానగర్‌ మానేరువాగు తీరంలో నిమజ్జన వేడుకల నిర్వహణపై చర్చించారు. వినా యకుడి విగ్రహాల నిమజ్జనానికి భారీ క్రేన్‌ల ఏర్పాట్లు, వాహనాల రాకపోకలకు ప్రత్యేక మార్గాలు, సందర్శకుల గ్యాలరీ ఏర్పాటు, చిన్న చిన్న ప్రతిమల నిమజ్జన కొలనుల ఏర్పాట్లపై సమీక్షించారు. వారి వెంట సిరిసిల్ల టౌన్‌, రూరల్‌ సీఐలు శ్రీనివాస్‌, నాగేశ్వరరావు, మున్సిపల్‌ డీఈఈ పి.వాణి, ఏఈఈ నర్సింహాస్వామి, సిరిసిల్ల టౌన్‌ ఎస్సై అశోక్‌, మున్సిపల్‌, పోలీస్‌ సిబ్బంది ఉన్నారు.

మందు తాగం..

మాంసం ముట్టం

ముస్తాబాద్‌(సిరిసిల్ల): ఆదిదేవుడు గణపతి నవరాత్రి ఉత్సవాలను ఎంతో నిష్టగా, ఉపవాసలతో నిర్వహిస్తామని నిర్వాహకులు ప్రమాణం చేశారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం బందనకల్‌లో యువకులు గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అయితే మందు, మాంసం, డీజే సినిమా పాటల జోలికి వెళ్లమని దేవుని సాక్షిగా, అర్చకుడు రాజేందర్‌శర్మ ఆధ్వర్యంలో ప్రమాణం చేశారు. తొమ్మిది రోజులపాటు పరమ పవిత్రంగా ఉత్సవాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. కాగా, చోట్ల యువకులు గణేశ్‌ ఉత్సవాల పేరుతో చిందులు వేయడం, మద్యం తాగడం జరుగుతుందని అర్చకులు పేర్కొన్నారు. బందనకల్‌ యువత మాత్రం అందుకు భిన్నంగా ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని, వీరిని ఆదర్శంగా తీసుకోవాలని కోరుతున్నారు.

ప్రభుత్వమే వారోత్సవాలు నిర్వహించాలి

ఇల్లంతకుంట: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను ఏటా సెప్టెంబర్‌ 17న ప్రభుత్వమే నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. ఇల్లంతకుంట మండలం గాలిపెల్లిలో మంగళవారం బద్దం ఎల్లారెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసింది తెలంగాణ సాయుధ రైతా ంగమే అన్నారు. ఈనెల 12నుంచి 17వరకు తె లంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 17న హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో జరిగే వారోత్సవాల ముగింపు బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. సీపీఐ జిల్లా కార్యదర్శి మంద సుదర్శన్‌, జిల్లా కమిటీ సభ్యులు మంద అనిల్‌, సావనపల్లి మల్లేశం, భూంపల్లి భూంరెడ్డి, మీసం లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement