తిలా పాపం.. తలా పిడికెడు! | - | Sakshi
Sakshi News home page

తిలా పాపం.. తలా పిడికెడు!

Sep 16 2026 3:19 AM | Updated on Sep 16 2026 3:19 AM

మావోళ్ల మాయాజాలం

సిరిసిల్ల: అందరి పల్లెంలో మెతుకునై.. మనిషికి జీవనాధారమైన నేను ఇప్పుడు ఎవ్వరికీ కానిదాన్ని అయినాను. అన్నం పెట్టే అన్నదాతలకు, ఆకలితో ఉన్నవారికి అన్నపూర్ణనైన నేను.. ఏళ్లుగా సగర్వంగా జీవించాను. నా చెంతకు చేరిన వారికి ఉపాధినిస్తూ రేయింబవళ్లు శ్రమించాను. పంట పండించిన రైతులకు పైసలిస్తూ.. అర్ధరాత్రి అపరాత్రి అనకుండా.. గాసం ఇస్తూ.. నా నిర్వహణ చూసేవారికి సమాజంలో గౌరవాన్ని తెచ్చి పెడుతూ.. ఎంతో నమ్మకంగా మెలిగాను. కానీ.. ఇప్పుడు నా రెక్కలు విరిగాయి. బొక్కలు మూలకుపడ్డాయి. పాలకుల విధానపరమైన లోపాలు.. నన్ను ఏలినోళ్ల పాపాలు.. మార్కెట్‌లో నెలకొన్న పోటీతో పైసకు కొరగాకుండా అయ్యాను. ఒకప్పుడు గొప్పగా జీవించిన నేను.. అప్పుల్లో కూరుకుపోయి.. తిప్పలు పడుతున్న. ఇంతకీ నేను ఎవరో మీకు చెప్పనే లేదు కదూ.. నేను మీ ఊరి రైస్‌మిల్లును. నా మనసులోని మాటలను పంచుదామని వచ్చాను.

ఈ పాపం ఎవ్వరిది?

గతమెంతో ఘనమైన చరిత్ర ఉన్న నేను.. ఇప్పుడు ఎవ్వరికీ కొరగానిదాణ్ణి అయినాను. అమ్మో.. రైస్‌మిల్లా అనే దుస్థితికి చేరారు. నేనేం తప్పు చేయలేదు. నాలుగు దశాబ్దాలుగా పల్లెల్లో గిర్నీగా మొదలైన నా ప్రస్థానం భారీ రైస్‌మిల్లుల వరకు చేరింది. ప్రభుత్వ విధానాల నేపథ్యంలో రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేస్తూ.. రైస్‌మిల్లులకు ఇస్తూ బియ్యాన్ని తీసుకునే వ్యవస్థ రావడంతో అసలు సమస్య మొదలైంది. క్వింటాలు వడ్లను మిల్లుకు ఇచ్చి 67 కిలోల బియ్యాన్ని ఇవ్వాలనే నిబంధన పెట్టారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 55 కిలోల బియ్యం కూడా రావడం లేదని యజమానులు చెబుతున్నారు. కానీ... సర్కారు మిల్లర్ల మొరవినడం లేదు. 2014 నుంచి మిల్లులకు చెల్లించాల్సిన మిల్లింగ్‌, రవాణా, డ్రైయేట్‌, కస్టోడియన్‌ చార్జీలు ఇవ్వడం లేదు. క్వింటాలు వడ్లను బియ్యంగా మార్చి ఇస్తే రూ.10 ఇస్తున్నారు. ఇది ఏనాడో 40 ఏళ్ల కిందట నిర్ణయించిన ధర. వాస్తవానికి క్వింటాలు వడ్లు పడితే మార్కెట్‌లో రూ.150 ఖర్చు అవుతుంది. మార్కెట్‌ రేట్లను పరిగణనలోకి తీసుకోకుండా పాత ధరలనే అమలు చేస్తున్నారు. ఎవరైనా బియ్యం సకాలంలో పెట్టకుంటే.. పెండింగ్‌లో ఉన్న బియ్యానికి 25 శాతం జరిమానా.. 12 శాతం వడ్డీతో డబ్బులు చెల్లించాలనే నిబంధన పెట్టారు. నేను వ్యవసాయ అనుబంధంగానే నడుస్తాను. నా నిర్వహణలో విద్యుత్‌ వినియోగం తప్పనిసరి. 100 హెచ్‌పీల వరకు ఎల్‌టీ విద్యుత్‌గా పరిగణిస్తున్నారు. పెరిగిన యాంత్రీకరణతో 250 హెచ్‌పీల వరకు ఎల్‌టీగానే చూడాలని, హెచ్‌టీగా విద్యుత్‌ బిల్లులు వేయొద్దని మా వాళ్లు కోరుతున్నారు.

మిల్లు గొల్లుమంటుంది

మనసు ఊరుకో‘లేఖ’

ఇది రైస్‌మిల్లు ఆవేదన

ఇగ మావోళ్ల మాయాజాలం అంతా ఇంతా కాదు. కొందరు సవ్యంగానే నా నిర్వహణ చూస్తుండగా.. మరి కొందరైతే.. రేషన్‌ బియ్యాన్ని కొనుగోలు చేస్తూ.. అవే బియ్యాన్ని మళ్లీ సర్కారుకు సరఫరా చేస్తూ.. కేసుల పాలవుతున్నారు. దొడ్డు బియ్యాన్ని సన్నంచేస్తూ.. సామాన్యులను నిండా ముంచుతున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి. సర్కారు వడ్లను కొని ఇస్తే.. ఆ వడ్లను అటుకుల మిల్లులకు, ప్యాలాల మిల్లులకు అమ్ముతూ.. పొరుగు దేశాలను ఎగుమతి చేస్తూ.. వచ్చిన సొమ్మును ఇతర వ్యాపారాల్లో పెట్టినోళ్లు ఉన్నారు. మావోళ్ల కథలు.. ఒక్కొక్కటి బయటికి రావడంతో సర్కారోళ్లు ఇన్నేళ్లుగా మెక్కిన సొమ్మును కక్కుమని కేసులు పెడుతూ జైలుకు పంపుతున్నారు. మధ్యే మార్గాన్ని ఆలోచించి.. భవిష్యత్‌లో తప్పులు జరగకుండా.. సవరిస్తూ.. సర్కారుకు రావాల్సిన రూ.కోట్లను వసూలు చేయాల్సిందే. ఉన్న పళంగా నా గొంతు పిసికేయొద్దు. సామరస్యంగా కూర్చుని చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. ఇరువర్గాలు ఆలోచించాలి. ఇంతసేపు మీ సమయాన్ని వెచ్చించి.. నా గుండెల్లోని బాధను ఆలకించిన మీకు పది వేల వందనాలు. ఇక ఉంటాను.

ఇట్లూ... సదా మీ అందరి క్షేమాన్ని, సంక్షేమాన్ని కోరే.. – మీ రైస్‌ మిల్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement