వేములవాడ: ప్రకృతి సేద్యకుడు, వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన సామ ఎల్లారెడ్డి (43) గుండెపోటుతో మృతిచెందారు. పదేళ్ల పాటు విదేశాల్లో ఉన్న ఆయన ఐటీ రంగంలో పనిచేస్తూ.. రూ.కోట్లు వచ్చే జీతాన్ని వదిలి స్వదేశం చేరారు. కన్నతల్లి లాంటి నేలతల్లి సేవకే అంకితమయ్యారు. సిద్దిపేట వద్ద ఆరెకరాల భూమిని ఎంచుకుని పూర్తిస్థాయి ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రారంభించారు. పాలిహౌస్‌లలో జెర్బెరా పూల సాగుతోపాటు ఆర్గానిక్ పంటల్లో అద్భుతమైన విజయాన్ని సాధించారు. ఆయన సాగు పద్ధతులు, పట్టుదల ఎందరో రైతులకు దిశానిర్దేశం చేశాయి.
వినాయక చవితి వేళ విషాదం
అందరికీ ఆరోగ్యం, ఉపాధి పంచుతూ.. పచ్చటి సాగు ప్రయాణాన్ని కొనసాగిస్తున్న ఎల్లారెడ్డి వినాయక చవితి రోజున అకస్మాత్తుగా గుండెపోటుతో మృతిచెందాడు. మంగళవారం ఆయన అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆయన అకాల మరణంతో వేములవాడ, సిద్దిపేట ప్రాంతాలు విషాదంలో మునిగిపోయాయి. విదేశీ ఉద్యోగం వదిలి మట్టిలోకి దిగి ఆయన సాధించిన విజయాలు, ప్రకృతి వ్యవసాయ విధానాలు అప్పట్లో మహర్షి సినిమా ద్వారా రైతు ప్రాముఖ్యతను చాటిన సూపర్ స్టార్ మహేష్‌బాబు దృష్టిని ఆకర్షించాయి. నిజమైన ‘రియల్ మహర్షి’ అని మహేష్‌బాబు ఆయనను అభినందించారు. ప్రకృతి సేద్యంలో ఆయన సాధించిన ప్రగతికి సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ‘ఆదర్శ ప్రకృతి సేద్యం రైతు’ అవార్డు అందుకున్నారు. ఇటీవల హన్మాజీపేట స్కూల్ 75 ఏళ్ల ప్లాటినం జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న ఆయన రెండు రోజులపాటు హాజరైన దాదాపు రెండు వేల మంది పూర్వ విద్యార్థులకు స్వయంగా రాగి జావా పంపిణీ చేశారు.
వేములవాడరూరల్: సిద్దిపేటలో మృతి చెందిన వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన సామ ఎల్లారెడ్డికి లింగంపల్లి గ్రామస్తులు కన్నీటితో వీడ్కోలు పలికారు. గ్రామస్తులతో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
ప్రకృతి శాస్త్రవేత్త సామ ఎల్లారెడ్డి
పండుగ పూట అనంతలోకాలకు..


