హామీలు నెరవేర్చే వరకు ఉద్యమిస్తాం
సిరిసిల్ల అర్బన్: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేసే వరకు ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పేర్కొన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్ వద్ద శుక్రవారం బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ రెండున్నరేళ్లు గడిచినా కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు. విద్యార్థిభృతి, నిరుద్యోగుల భృతి ఇంకా అందలేదన్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల విషయంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రెండున్నరేళ్లుగా రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని, ఎన్నికల సమయంలో మాత్రమే రైతు భరోసా ప్రభుత్వానికి గుర్తుకొస్తుందన్నారు. మహిళలకు ప్రకటించిన కల్యాణలక్ష్మి, తులం బంగారం వంటి పథకాల అమలు ఎక్కడుందో చెప్పాలని ప్రశ్నించారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్‌కు వినతి పత్రం అందజేశారు.
పట్టుదలతో చదివి ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలి
చందుర్తి/రుద్రంగి(వేములవాడ): విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు మర్రిపల్లి చందన కోరారు. బాలల హక్కుల పరిరక్షణపై అవగాహన సదస్సును చందుర్తి మండలం సనుగుల గ్రామపంచాయతీ గంగిరెద్దులకాలనీలో శుక్రవారం నిర్వహించారు. రుద్రంగి మండలం గైదిగుట్టలో నిర్మిస్తున్న గిరిజన బాలికల వసతి గృహం, రుద్రంగి జెడ్పీ హైస్కూల్, కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలను పరిశీలించారు. ఈ సందర్భంగా చందన మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. గంగిరెద్దులకాలనీని దత్తత తీసుకుని పిల్లలకు మెరుగైన విద్య, వైద్యం అందిస్తామన్నారు. జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, చందుర్తి ఎంపీడీవో లెంకల రాధ, ఐసీడీఎస్ సీడీసీవో సౌందర్య, సర్పంచ్ బొడిగే లావణ్య, ఉపసర్పంచ్ స్వామి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి కవిత, హెచ్‌ఎంలు సత్యనారాయణ, కట్కూరి ముఖేష్ తదితరులు పాల్గొన్నారు.


