సిరిసిల్లటౌన్: చెత్తను వీధుల్లో పారవేస్తున్న వ్యాపారులపై బల్దియా కొరడా ఝుళిపించింది. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దబజారు ప్రాంతంలో శనివారం కొందరు వ్యాపారులు, స్థానికులు చెత్తను వాహనానికి ఇవ్వకుండా రోడ్లపై పడేస్తున్నట్లు కమిషనర్ ఖదీర్‌పాషా తెలిపారు. ఇలాంటి పనులతో ప్రజా ఆరోగ్యానికి హానికరంగా మారుతున్నాయన్నారు. చెత్తను రోడ్డుపై పడేస్తున్న షాపు యజమానులు ఒక్కొక్కరికి రూ.5వేల చొప్పున జరిమానాలు విధించినట్లు తెలిపారు. ప్రత్యేక డ్రైవ్‌లో సానిటరీ ఇన్‌స్పెక్టర్ కిరణ్, మున్సిపల్ జవాన్లు పాల్గొన్నారు.
సిరిసిల్లటౌన్: కార్మికక్షేత్రంలో వెంటనే వర్కర్ టు ఓనర్ పథకం పూర్తి చేసి కార్మికులకు అందించాలని పవర్‌లూమ్స్ వర్కర్స్ యూని యన్ రాష్ట్ర అధ్యక్షుడు మూశం రమేశ్ డిమాండ్ చేశారు. నేతన్నల సమస్యల సాధన, సిరిసిల్ల వస్త్రపరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టాల్సిన అంశాలను ప్రస్తావిస్తూ చేపడుతున్న ఈనెల 25న జరిగే మహాధర్నా పోస్టర్లను శనివారం ఆవిష్కరించారు. ఇందిరా మహిళా శక్తి చీరల వస్త్రం నేసిన కార్మికులకు 10 శాతం యారన్ సబ్సిడీ అందించాలని కోరారు. చేనేత జౌళి శాఖ గుర్తింపుకార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మాదిరిగా పవర్‌లూమ్స్‌కు ఉచిత విద్యుత్ అమలు చేయాలని కోరారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కోడం రమణ, యూనియన్ జిల్లా నాయకులు సిరిమల్ల సత్యం, బెజుగం సురేష్, ఒగ్గు గణేశ్, సందుపట్ల పోచమల్లు పాల్గొన్నారు.
వీర్నపల్లి(సిరిసిల్ల): కాపాడుకున్నప్పుడే మానవజాతి మనుగడ సాధ్యమని ఎఫ్‌ఆర్వో కల్పనదేవి పేర్కొన్నారు. ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకుని వీర్నపల్లిలో శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఎఫ్‌ఆర్వో మాట్లాడుతూ.. అటవీ సంపదను అంతం చేయడం ద్వారా వన్యప్రాణులు కనుమరుగవుతున్నాయన్నారు. అనంతరం ఉపాధిహామీ కూలీలతో కలిసి కేక్ కట్ చేశారు. సర్పంచ్ మల్లారపు జ్యోత్స్న, ఉపసర్పంచ్ జక్కుల నరేశ్, మాజీ ఎంపీటీసీ అరుణ్‌కుమార్ గ్రామస్తులు పాల్గొన్నారు.


