● కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల: జిల్లాలో యాసంగి(రబీ) ధాన్యం సేకరణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం అధికారులు, రైస్‌మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ ధాన్యం సేకరణపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. గన్నీసంచుల లభ్యతపై చర్చించారు. జిల్లాలో 4లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారని, 2.70 లక్షల నుంచి 3 లక్షల టన్నుల కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఐకేపీ ఆధ్వర్యంలో 159, పీఏసీఎస్ 73, డీసీఎంఎస్ 1, మెప్మా ఆధ్వర్యంలో 7 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. 5,839 టార్పాలిన్లు, 507 తేమ యంత్రాలు, 700 ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్లు, 606 ప్యాడీ క్లీనర్లు, 270 డిజిటల్ గ్రైన్ క్యాలివర్స్, 270 హస్క్ రిమూవర్లు, రెండు డ్రైయర్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. కేంద్రాల్లో తాగునీటి వసతి, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, నీడ వసతి కల్పించాలని సూచించారు. ధాన్యం వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తూ.. రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమయ్యేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు.
సీఎమ్మార్ ఇవ్వాలి
కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎమ్మార్)ను రైస్‌మిల్లర్లు గడువులోగా అందించాలని కలెక్టర్ ఆదేశించారు. యాసంగి సీజన్ ధాన్యానికి బ్యాంక్ గ్యారంటీలు అందించాలన్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యం దించుకునేందుకు హమాలీలను నియమించుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, డీసీఎస్‌వో బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, డీఆర్డీవో గీత తదితరులు పాల్గొన్నారు.
శ్రద్ధగా చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలి
తంగళ్లపల్లి(సిరిసిల్ల): విద్యార్థులు క్రమశిక్షణతో శ్రద్ధగా చదివి భవిష్యత్‌లో ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆకాంక్షించారు. తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మకాలనీ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలను గురువారం తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం కిచెన్, స్టోర్‌రూమ్స్ తనిఖీ చేశారు. స్టోర్‌రూమ్‌లో ఉన్న సరుకుల నాణ్యతను స్వయంగా పరిశీలించడంతోపాటు విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్థాలను, మెనూ చార్ట్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా.. లేదా అని తెలుసుకున్నారు. పట్టుదలతో చదివితే ఏదైనా సాధించవచ్చని విద్యార్థులను ఉత్తేజరపరిచారు.


