మెట్‌పల్లి (కోరుట్ల): పట్టణంలోని ఆర్టీసీ బస్‌స్టేషన్ ఇన్ గేట్ వద్ద శుక్రవారం బస్సు ఢీకొని వృద్ధుడు మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. శాంతినగర్‌కు చెందిన దుర్గయ్య(65) ఆర్టీసీ బస్ స్టేషన్ ఇన్‌గేట్ నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా, అదే సమయంలో వేగంగా లోపలికి వస్తున్న బస్సు అతన్ని ఢీకొట్టింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన వృద్ధుడిని ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపారు.
రాజన్న గుడి వద్ద నాగుపాము
వేములవాడ: రాజన్న ఆలయ విస్తరణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో రాజేశ్వరపురం వద్ద నిర్మాణం పనుల ప్రాంతంలో శుక్రవారం రాత్రి నాగుపాము ప్రత్యక్షమైంది. దీంతో పోలీసులు, ఎస్పీఎఫ్ సిబ్బంది ఆలయ అధికారులకు సమాచారం అందించారు. స్నేక్ క్యాచర్ జగదీశ్ చేరుకుని నాగుపామును పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేశారు.
సివిల్ సప్లయ్ అధికారుల తనిఖీలు
మంథని: పెద్దపల్లి జిల్లా మంథనిలోని పలు హోటళ్లలో సివిల్ సప్లయ్ అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. గృహ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న ఆరింటిని సీజ్ చేశారు. 6 హోటళ్లపై కేసులు నమోదు చేశారు. డీసీఎస్ రవీందర్‌రెడ్డి, సివిల్ సప్లయ్ ఇన్‌స్పెక్టర్ వెంకటరాజిరెడ్డి, ఆర్‌ఐ అనిల్‌రెడ్డి పాల్గొన్నారు.
పిడుగుపడి ఎద్దు మృతి
ఇల్లంతకుంట(మానకొండూర్): పిడుగుపడి శుక్రవారం తెల్లవారుజామున ఎద్దు మరణించింది. ఇల్లంతకుంట మండలం గాలిపెల్లిలో కేశవేణి ఎల్లయ్యకు చెందిన పశువుల కొట్టం వద్ద రెండు ఎడ్లను కట్టివేశాడు. శుక్రవారం తెల్లవారుజామున వర్షంతోపాటు పిడుగు పడడంతో ఒక ఎద్దు చనిపోయింది. గతేడాది హఠాత్తుగా ఒక ఎద్దు చనిపోయిందని, ఇప్పుడు మరో ఎద్దు చనిపోవడంతో అప్పులపాలైనట్లు రైతు రోదించాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.


