బోయినపల్లి(చొప్పదండి): ప్రజల ఉపాధి స్థితిగతులపై సర్వేలో భాగంగా మొదట సాధారణ వివరాలతో కూడిన సర్వే చేపట్టి వివరాలు నమోదు చేస్తున్నట్లు కరీంనగర్ గణాంక శాఖ అధికారి గుర్రం శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేలో భాగంగా మండలంలోని స్తంభంపల్లి, గుండన్నపల్లి గ్రామాల్లో శుక్రవారం జాతీయ గణాంక శాఖ 2026వ సంవత్సరానికి గాను సర్వే నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పట్టణాలు గ్రామాలను ఎంపిక చేసుకుని సర్వే చేసిన అనంతరం గ్రామంలో కొన్ని కుటుంబాలను ఎంపిక చేసి, మూడు నెలల పాటు నెలకు ఒకసారి పూర్తి సర్వే చేసి ప్రత్యేక ట్యాబ్‌లో వివరాలు నమోదు చేస్తామని పేర్కొన్నారు. తొలి విడతలో కుటుంబ యజమాని పేరు, సభ్యులు, విద్యార్హతలు, వృత్తివిద్య, ఉద్యోగం, స్వయం ఉపాధి వివరాలు రోజువారి కూలీ అయితే వివరాలు, మహిళలు స్వయం ఉపాధి పొందే వాళ్లు అయితే వారి ఆదాయ వివరాలు నమోదు చేసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో జయశీల, సర్పంచులు బొంగాని అశోక్, కొప్పుల లావణ్య నగేశ్, పంచాయతీ కార్యదర్శులు మౌనిక, ఎండీ. జాఫర్ హైమద్ ఉన్నారు.


