
మహిళలు ఆర్థికంగా ఎదగాలి
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ● లింగన్నపేటలో పెట్రోల్‌బంక్ ప్రారంభం
గంభీరావుపేట(సిరిసిల్ల): మహిళలు ఆర్థికంగా ఎదిగి ఆత్మగౌరవంతో జీవించాలనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. గంభీరావుపేట మండలం లింగన్నపేటలో శ్రీషిర్డీ సాయిబాబా గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్‌బంక్‌ను గురువారం కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళా సంఘాల ద్వారా మూడు పెట్రోల్ బంక్‌లు నడుస్తున్నాయన్నారు. పేదల సంక్షేమం ఎజెండాగా ఇందిరమ్మ పాలన కొనసాగుతోందన్నారు. గత పాలకులు ప్రజల ప్రయోజనాలు పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన శ్రీరాంసాగర్, మానేరు, నాగార్జునసాగర్, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టులు నేటికి ప్రజలకు సేవలందిస్తున్నాయన్నారు. మహిళలకు వడ్డీలేని రుణాల పథకం ప్రారంభించి ఇప్పటికే రెండుసార్లు చెల్లించినట్లు గుర్తు చేశారు. మహిళల ఆదాయం పెంచేందుకు స్వయం సహాయక సంఘాల ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, పాడిపశువుల పెంపకం, ఇందిరాశక్తి క్యాంటీన్, ఆర్టీసీకి అద్దె బస్సులు, పాఠశాలలకు ఏకరూప దుస్తులు కుట్టడం వంటి అనేక మార్గాలను అన్వేషిస్తున్నామన్నారు. జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, ఏఎంసీ చైర్‌పర్సన్ కొమిరిశెట్టి విజయ, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు హమీద్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మండ్లు, తహసీల్దార్ మారుతిరెడ్డి, ఎంపీడీవో రాజేందర్, ఐకేపీ ఏపీఎం సుదర్శన్, సీసీ దోమకొండ సురేందర్ పాల్గొన్నారు.
విద్యతోనే ఉన్నత లక్ష్యాలు సాధ్యం
గంభీరావుపేట/తంగళ్లపల్లి(సిరిసిల్ల): విద్య ద్వారానే ఉన్నత లక్ష్యాలు సాధ్యమని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా పేర్కొన్నారు. దమ్మన్నపేట, మండెపల్లి మోడల్‌స్కూళ్లలో ఆన్ అకాడమీ ద్వారా ఆన్‌లైన్ తరగతులను కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఢిల్లీ విద్యార్థులకు అందే శిక్షణ నేడు సాంకేతికతను వినియోగించుకొని రాజన్నసిరిసిల్ల జిల్లా విద్యార్థులకు అందిస్తున్నామన్నారు. జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, తహసీల్దార్‌లు మారుతిరెడ్డి, జయంత్‌కుమార్, ప్రిన్సిపాల్స్ శ్రీలత, విఠల్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హమీద్ పాల్గొన్నారు.