● మధ్యాహ్నం వంటకు కట్టెల పొయ్యే దిక్కు ● 30 శాతం స్కూళ్లకు గ్యాస్ సరఫరా ● రుద్రంగికి సిరిసిల్ల ఏజెన్సీ ● సిరిసిల్లకు వేములవాడ ఏజెన్సీ ● గందరగోళంగా ఏజెన్సీల కేటాయింపు ● నెలలుగా బిల్లులు పెండింగ్ ● ఇబ్బందుల్లో వంటకార్మికులు
సిరిసిల్ల ఎడ్యుకేషన్: మధ్యాహ్న భోజనం నిర్వాహకులు ఇప్పటికీ కట్టెల పొయ్యి మీదనే వంట చేస్తున్నారు. ప్రభుత్వం ద్వారా సిలిండర్‌లు సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో అందలేదు. ఫలితంగా జిల్లాలోని సగానికి పైగా పాఠశాలల్లో మధ్యాహ్నం వంటను కట్టెలపొయ్యి మీదనే తయారు చేస్తున్నారు. అసలే వర్షాకాలం.. వంట గదులు ఉరుస్తుండడంతో కట్టెలపొయ్యి మీదనే పొగచూరుతున్న గదుల్లోనే కళ్లు మండుతుండగా వంట చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 30 శాతం స్కూళ్లకు మాత్రమే సిలిండర్లు సరఫరా జరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే గ్యాస్ ఏజెన్సీల కేటాయింపు సైతం గందరగోళంగా మారడంతో సిలిండర్లు పూర్తి స్థాయిలో అందడం లేదని తెలిసింది. అంతేకాకుండా మధ్యాహ్న భోజనం నిర్వాహకులు వేతనాలు నెలల తరబడిగా పెండింగ్‌లో సాక్షి శుక్రవారం చేపట్టిన గ్రౌండ్ రిపోర్టులో తేలింది.
గ్యాస్ ఏజెన్సీల గందరగోళం
సిరిసిల్లలోని ప్రభుత్వ పాఠశాలలకు వేములవాడ గ్యాస్ ఏజెన్సీలు, జిల్లా సరిహద్దు మండలాలైన గంభీరావుపేట, రుద్రంగి మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు సిరిసిల్ల గ్యాస్ ఏజెన్సీలతో సిలిండర్‌లు సరఫరా చేయాలని ఉత్తర్వులు ఉన్నట్లు పలు వురు ప్రధానోపాధ్యాయులు పేర్కొన్నారు. దూరప్రాంతాలు కావడంతో గ్యాస్ సరఫరా ఇబ్బందికరంగా ఉంటుందని కేటాయింపులను సరిచేయాలంటూ ఏజెన్సీల నిర్వాహకులు కోరుతున్నారు. వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లోని ఏజెన్సీలకు ఆయా ప్రాంతాల్లోని పాఠశాలలు కేటాయిస్తే గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయడం ఇబ్బందిగా ఉండబోదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో మధ్యాహ్న భోజనం అమలవుతున్న 458 ప్రభుత్వ పాఠశాలలో ఇప్పటి వరకు జిల్లాలో 134 స్కూళ్ల మాత్రమే గ్యాస్ సిలిండర్లు సరఫరా జరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
బిల్లుల బకాయి
విద్యార్థులకు తరగతులవారీగా మధ్యాహ్న భోజన పారితోషకాన్ని కార్మికులకు చెల్లించాల్సి ఉంటుంది. నెలలు గడుస్తున్నా బిల్లులు రావడం లేదని మధ్యాహ్న భోజన కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకటి నుంచి 5వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ప్రతీ విద్యార్థికి మధ్యాహ్న భోజనానికి రూ.6.19, 6 నుంచి 8వ తరగతి వరకు రూ.9.29 చెల్లిస్తుండగా గత ఫిబ్రవరి వరకు బిల్లులు వచ్చాయి. 9 నుంచి 10వ తరగతి వరకు రూ.10.67 చెల్లిస్తుండగా ఈ విభాగంలో గత అక్టోబర్ వరకు నాలుగు నెలల బిల్లులు రావాల్సి ఉంది. కానీ జిల్లా విద్యాశాఖ అధికారులు మాత్రం మార్చి వరకు బిల్లులు చెల్లించినట్లు చెబుతున్నారు. త్వరలోనే పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని అధికారులు స్పష్టం చేశారు.
ఈ ఫొటో.. రుద్రంగి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండుతున్న నిర్వాహకులు. ఈ ప్రాంత పాఠశాలలకు సిరిసిల్ల గ్యాస్ ఏజెన్సీల ద్వారా సిలిండర్‌లు ఇవ్వాలని ఉత్తర్వులు ఉన్నాయి. అయితే శుక్రవారం నాటికి కూడా గ్యాస్ సిలిండర్లు సరఫరా కాలేదు. దీంతో కట్టెల పొయ్యిపైనే మధ్యాహ్నం వంటను సిద్ధం చేస్తున్నారు.
ఇక్కడ కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్న వారు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గీతానగర్ ప్రాథమిక పాఠశాలలోని నిర్వాహకులు. ఇక్కడికి వేములవాడ గ్యాస్ ఏజెన్సీ నుంచి సిలిండర్ రావాలి. కానీ శుక్రవారం నాటికి కూడా సిలిండర్ అందలేదు. చేసేదేమీ లేక ఇలా కట్టెల పొయ్యి మీదనే వంట చేస్తున్నారు.
పొగచూరుతున్నాయ్..
పొగచూరుతున్నాయ్..