
మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ● వన్‌పల్లిలో ఎరువులు, విత్తన దుకాణం ప్రారంభం
ఎల్లారెడ్డిపేట/వీర్నపల్లి(సిరిసిల్ల): మహిళా సంఘాల సభ్యులు స్వయం ఉపాధి యూనిట్లతో ఆర్థికాభివృద్ధి సాధించాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆకాంక్షించారు. వీర్నపల్లి మండలం వన్‌పల్లిలో ఎరువులు, విత్తనాలు, పురుగులమందుల దుకాణాన్ని శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలోని మహిళా సంఘాలకు ఇప్పటికే క్యాంటీన్లు, డెయిరీ యూనిట్, కోడిపిల్లల పెంపకం, ఆర్టీసీ బస్సుల యూనిట్లు మంజూరు చేసినట్లు వివరించారు. అనంతరం వన్‌పల్లిలోని అంగన్‌వాడీ కేంద్రం, ప్రైమరీ స్కూల్‌ను తనిఖీ చేశారు. అంగన్‌వాడీ కేంద్రంలోని వంటిగదిలో వర్షం నీరు ఉరుస్తుండడంతో పాఠశాలలోని అదనపు గదిలోకి మార్చాలని సూచించారు. ప్రైమరీ స్కూల్‌లో 30 మంది విద్యార్థులు మాత్రమే ఉండడంపై ఉపాధ్యాయులను నిలదీశారు. ప్రవేశాలు పెంచాలని సూచించారు.
దివ్యాంగురాలికి బాసటగా..
పాఠశాల ఎదురుగా నివసిస్తున్న దివ్యాంగులు లింగంపల్లి సుజాత తన ఇంటికి వెళ్లేందుకు నాలా అడ్డుగా ఉందని, పాత పెంకుటిల్లుతో ఇబ్బంది పడుతున్నానని కలెక్టర్‌కు మొరపెట్టుకోగా.. వెంటనే స్పందించి నాలాపై సిమెంట్ దిమ్మెను ఏర్పాటు చేయాలని, నల్లా కనెక్షన్ ఇవ్వలాని అధికారులను అదేశించారు. ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని సూచించారు. ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. లబ్ధిదారులకు ఇసుక, మట్టి కోసం ఇబ్బంది పడకుండా పంచాయతీ అధికారులు చూడాలన్నారు. అనంతరం మండల కేంద్రంలోని పీహెచ్‌సీని పరిశీలించి రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని సూచించారు.
శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకోవాలి
ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌లో అన్ అకాడమీ పేరుతో జేఈఈ, నీట్ పరీక్షలకు ఆన్‌లైన్ శిక్షణ తరగతులను కలెక్టర్ ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు నిత్యం రెండు గంటలపాటు ఆన్‌లైన్ శిక్షణ ఉంటుందని తెలిపారు. గురుకులాల్లోని 8 నుంచి 12వ తరగతులు విద్యార్థుల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డీఆర్డీవో శేషాద్రి, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్‌బేగం, డీడబ్ల్యూవో లక్ష్మీరాజం, మండల వ్యవసాయాధికారి జయ, ఆర్‌ఐ శివకుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాములు, వైస్‌చైర్మన్ లక్ష్మణ్ పాల్గొన్నారు.