సింగరాయకొండ: తౌషిక్, తల్లి మౌలాబీ కుటుంబానికి వైఎస్సార్ సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని, వారిద్దరి మృతిపై సీబీఐ విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని, జరుగుమల్లి బీసీ వసతి గృహం ఘటనపై సమగ్ర విచారణ జరపాలని కొండపి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక పార్టీ క్యాంపు కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. డాక్టర్ సురేష్ మాట్లాడుతూ ఆరు నెలల క్రితం విద్యార్థి తౌషిక్ మృతిపై తల్లిదండ్రులు పలు ఆరోపణలు చేస్తే అప్పటి సీఐ, ఎస్సైలు పట్టించుకోకుండా అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దోషులను కాపాడే ప్రయత్నం చేశారని ఆరోపించారు. దీనిపై పోలీసులు, మంత్రి స్వామి, ఎంపీ మాగుంట కాని పట్టించుకోలేదని, చివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ను కలిసినా ప్రయోజనం లేకపోవడంతో మానసికంగా ఆవేదన చెందిన తల్లి మౌలాబీ ఆత్మహత్యకు పాల్పడిందని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో జరిగిన హత్యేనని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా ఆ కుటుంబాన్ని మంత్రి స్వామి పరామర్శించిన దాఖలాలు లేవని, మైనార్టీలు అంటే మంత్రి స్వామికి చిన్నచూపని ఆరోపించారు.
జ్యుడిషియల్ విచారణ చేయాలి
ఈ నెల 12వ తేదీన ఒంగోలులో శాంతియుత ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్లిన వైఎస్సార్ సీపీ మైనారిటీ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి కొత్తపట్నం, చీమకుర్తి, జరుగుమల్లి పోలీస్స్టేషన్ల్లో నిర్బంధించారని మాజీ మంత్రి సురేష్ ఆరోపించారు. సామాన్యునికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించే హక్కు కూడా కూటమి ప్రభుత్వంలో లేదా అని ప్రశ్నించారు. చివరికి పోలీసులు అరెస్టు చేసిన వారిలో మౌలానాలు కూడా ఉన్నారని, నమాజ్ చేసుకోవాలని కోరినా పోలీసులు పట్టించుకోలేదని విమర్శించారు. ఇటీవల ఒంగోలుకు పార్టీ నాయకుడు కాకుమాను రాజశేఖర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసేందుకు మౌలాబీ కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తే ఆ సమాచారం తెలుసుకున్న పోలీసులు వారిని గృహ నిర్బంధం చేశారని ఆరోపించారు. తౌషిక్ మృతి కేసును తప్పుదారి పట్టించిన సీఐ హజరత్తయ్యను ముస్లింల అక్రమ అరెస్టుకు ఉపయోగించడం దారుణమన్నారు. తౌషిక్ కేసులో నిందితులైన స్కూల్ యాజమాన్యానికి పోలీసులు అండగా నిలుస్తున్నారని, వారిని అరెస్టు చేసేందుకు ఎందుకు వెనకాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. సీబీఐ విచారణ వేసి మొదటి నుంచి కేసును విచారిస్తే తప్ప వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం లేదని, అలాగే 12వ తేదీ ఘటనపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
బీసీ హాస్టల్ ఘటనపై విచారణ జరపాలి
జరుగుమల్లిలోని బీసీ బాలికల వసతి గృహంలో బాలికలకు రక్షణ లేకపోవడం దారుణమన్నారు. సంక్షేమశాఖ మంత్రి స్వామి ఇలాకాలో బీసీలకు భధ్రత లేకపోవటం అన్యాయమన్నారు. హాస్టల్‌కు వార్డెన్‌ను కూడా నియమించలేని చేతగాని ప్రభుత్వంగా గుర్తింపు సాధించిందని ఎద్దేవా చేశారు. తమ పిల్లలకు హాస్టల్లో భధ్రత లేదని భావించిన తల్లిదండ్రులు టీసీలు తీసుకుని వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ విద్యార్థినులకు భధ్రత కల్పించలేని అసమర్థ ప్రభుత్వంగా చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శించారు. హాస్టల్ ఘటనపై సమగ్ర విచారణ జరిపి ఇందులో బాధ్యులను కఠినంగా శిక్షించి విద్యార్థినులకు పూర్తిస్థాయిలో భద్రత కల్పించాలని, తక్షణమే వార్డెన్‌ను నియమించాలని ప్రభుత్వాన్ని డాక్టర్ ఆదిమూలపు సురేష్ డిమాండ్ చేశారు. పార్టీ మండలాల అధ్యక్షులు మసనం వెంకట్రావు, చింతపల్లి హరిబాబు, బచ్చల కోటేశ్వరరావు, ఇంకొల్లు సుబ్బారెడ్డి, పిన్నిక శ్రీనివాసరావు, బెజవాడ వెంకటేశ్వర్లు, షేక్ సుల్తాన్, షేక్ కరీం, మాదాల శంకర్, దాసరి శేషయ్య, పాకనాటి సుబ్బారెడ్డి, నూకసాని ప్రసాద్, ప్రభాకరరెడ్డి, మిరియం సుధాకర్, యనమల మాధవి పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ నాయకుల అరెస్టుపై జ్యుడిషియల్ విచారణ జరపాలి
వైఎస్ జగన్‌ను కలవకుండా మౌలాబీ కుటుంబ సభ్యుల హౌస్ అరెస్టు అన్యాయం
మౌలాబీ కుటుంబానికి అండగా వైఎస్సార్ సీపీ మైనారిటీ విభాగం
తౌషిక్ కేసుపై కనీస స్పందన లేని
మంత్రి బాలవీరాంజనేయస్వామి
జరుగుమల్లి బీసీ హాస్టల్ ఘటనపై
సమగ్ర విచారణ జరపాలి
విలేకరుల సమావేశంలో
మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్


