ఒంగోలు సిటీ: సింగరాయకొండలోని చైతన్య పాఠశాల నవోదయ కోచింగ్ కేంద్రంలో చదువుకుంటున్న కనిగిరికి చెందిన పదేళ్ల బాలుడు తౌషిక్ అనుమానాస్పద మృతి ఘటనపై ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తక్షణమే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మాజీ సభ్యురాలు బత్తుల పద్మావతి డిమాండ్ చేశారు. తౌషిక్ మృతిపై తల్లిదండ్రులు వ్యక్తం చేసిన అనుమానాలు, వేధింపులకు సంబంధించిన ఆరోపణలు, అందుబాటులో ఉన్న వైద్య, పోస్టుమార్టం నివేదికలు, పోలీసు దర్యాప్తు వివరాలను నిష్పక్షపాతంగా పరిశీలించి వాస్తవాలు వెలికితీయాలని ఆమె కోరారు. న్యాయం కోసం పోరాడిన బాలుడి తల్లి మరణించిన ఘటన మరింత విషాదకరమని పేర్కొంటూ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నవోదయ, సైనిక్ స్కూల్ కోచింగ్ కేంద్రాలు, ప్రైవేట్ హాస్టళ్లలో విద్యార్థుల భద్రత, వసతి, ఆహారం, వార్డెన్ల ప్రవర్తన, బాలలపై శారీరక, మానసిక వేధింపుల నివారణకు పటిష్ట పర్యవేక్షణ అవసరమన్నారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న సంస్థలను గుర్తించి నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యాలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తౌషిక్ మృతి ఘటనపై ఏపీ ఎస్సీపీసీఆర్ సుమోటోగా కేసు స్వీకరించి విచారణ చేపట్టాలన్నారు. ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసి బాలుడి మృతికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరపాలన్నారు. పాఠశాల యాజమాన్యం, వార్డెన్ లేదా ఇతరుల నిర్లక్ష్యం, వేధింపులు ఉన్నట్లు తేలితే బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించిన విద్యాశాఖ అధికారుల పాత్రపై విచారణ జరపాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కోచింగ్ కేంద్రాలు, ప్రైవేట్ హాస్టళ్ల అనుమతులు, భవన భద్రత, అగ్నిమాపక ఏర్పాట్లు, విద్యార్థుల రికార్డులు, బాలల రక్షణ ప్రమాణాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలన్నారు. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మార్గదర్శకాలను అమలు చేసి పిల్లల భద్రతకు పటిష్ట పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు.


