రోడ్డెక్కిన రైతులు | - | Sakshi
Sakshi News home page

రోడ్డెక్కిన రైతులు

Oct 15 2026 11:53 AM | Updated on Oct 15 2026 11:53 AM

రోడ్డెక్కిన రైతులు

సంతమాగులూరు (అద్దంకి): సాక్షాత్‌ విద్యుత్‌ శాఖ మంత్రి సొంత నియోజకవర్గం అద్దంకిలో వ్యవసాయ విద్యుత్‌ పరిస్థితి దారుణంగా మారింది. తరుచూ విద్యుత్‌ కోతలు, లోవోల్టేజీ సమస్యతో పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహించిన సంతమాగులూరు మండలంలోని ఐదు గ్రామాల రైతులు బుధవారం ఆందోళనకు దిగారు. కొమ్మలపాడు, మామిళ్లపల్లి, మక్కెనవారిపాలెం, కుందూరు, ఏల్చూరు గ్రామాలకు చెందిన సుమారు 200 మంది రైతులు కొమ్మలపాడు విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను ముట్టడించి అద్దంకి–నార్కెట్‌పల్లి రాష్ట్రీయ రహదారిపై ధర్నా చేశారు. ధర్నా సమాచారం తెలుసుకున్న సంతమాగులూరు పోలీసులు అక్కడికి చేరుకుని ధర్నా చేస్తున్న వారిని ఎందుకు చేస్తున్నారనే విషయం అడగకుండా అక్కడి నుంచి వారిని నెట్టేసే ప్రయత్నం చేశారు. రైతులు ప్రతిఘటించడంతో చేసేంది లేక సర్ది చెప్పి ధర్నాను విరమింపజేశారు.

రెండు నెలలుగా లోవోల్టేజీ సమస్య

రెండు నెలలుగా లోవోల్టేజీ సమస్యతో వ్యవసాయ మోటార్ల నుంచి నీరు సక్రమంగా రావడం లేదని, దీంతో తాము సాగు చేసిన మిరప తదితర పంటలు ఎండిపోతున్నాయని రైతులు వాపోయారు. రైతులకు రోజుకు తొమ్మిది గంటల విద్యుత్‌ సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఆ హామీ అమలుకు నోచుకోవడం లేదన్నారు. బుధవారం ఉదయం 6.30 గంటలకు సరఫరా కావాల్సిన విద్యుత్‌ ఉదయం 10 గంటలకు వచ్చిందని చెప్పారు. విద్యుత్‌ లోవోల్టేజీతో మోటార్లు కాలిపోతుండగా మరోవైపు మిరప పంట ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం

విద్యుత్‌ సమస్యలను పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించలేదని రైతులు మండిపడ్డారు. విద్యుత్‌ అధికారి దీపక్‌రెడ్డికి సమస్యలు వివరించినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదని పేర్కొన్నారు. విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలోనే రైతులు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడం ఏమిటని ప్రశ్నించారు. వ్యవసాయానికి నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేసి తమను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

సీఐ జోక్యంతో ఆందోళన విరమణ

రైతుల ఆందోళనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా సమాచారం అందుకున్న సీఐ శేషగిరి అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. వారి సమస్యలను ఉన్నతాధికారులు, మంత్రి దృష్టి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు శాంతించి ఆందోళన విరమించారు. విద్యుత్‌ సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే పంటలు పూర్తిగా దెబ్బతిని తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి ఖాదర్‌బాషా మాట్లాడుతూ రైతుల విద్యుత్‌ సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. రైతుల ఇబ్బందులు పట్టించుకోకపోతే మరోసారి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆందోళనలో ఆయా గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

లోవోల్టేజీపై రైతుల ఆగ్రహం

అద్దంకి–నార్కెట్‌పల్లి హైవే దిగ్బంధం

కొమ్మాలపాడు విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ముట్టడి

కూటమి ప్రభుత్వంలో రైతు కంటతడి

కూటమి ప్రభుత్వ హయాంలో రైతులు తమ పంటలు ఎండిపోతున్నాయని కంట తడి పెట్టే పరస్థితి నెలకొందని వైఎస్సార్‌ సీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్డర్‌ చింతలపూడి అశోక్‌కుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కొమ్మాలపాడులో కడుపుమండిన రైతుల ధర్నా విషయమై ఆయన స్పందించారు. ఆయన మాట్లాడుతూ రైతు సుభిక్షంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. ఇప్పటికై నా అఽధికారులు, విద్యుత్‌ శాఖ మంత్రి పట్టించుకుని, సిగ్గుతో తలదించుకుని, సరైన విధంగా విద్యుత్‌ను సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. – డాక్టర్‌ చింతలపూడి అశోక్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement