● అక్కడికక్కడే యువకుడి మృతి
సంతమాగులూరు (అద్దంకి): రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన పాతమాగులూరు సమీపంలో బుధవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. దొనకొండ మండలం కొచ్చర్లకోట గ్రామానికి చెందిన చింతగుంట్ల వెంకట ఆంజనేయులు (25) స్వగ్రామం నుంచి నరసరావుపేట వైపు బైకుపై వెళ్తున్నాడు. ఈ క్రమంలో మండలంలోని పాతమాగులూరు సమీపంలోకి రాగానే గుంటూరు నుంచి మార్కాపురం వెళ్తున్న కారు బైకును ఢీకొట్టింది. బైకుపై ఉన్న ఆంజనేయులు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం వైద్యశాలకు తరలించారు.
మార్కాపురం టౌన్: ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ సంఘటన పట్టణంలోని భగత్సింగ్ కాలనీ సమీపంలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బి.కాశీనాయక్ (20) డిగ్రీ చదివి ఇంటి వద్ద ఉంటున్నాడు. బంధువుల పెళ్లికి వెళ్లేందుకు సిద్ధంగా ఉండగా అనుకోని పరిస్థితుల్లో నోటి నుంచి రక్తపు వాంతులతో ఒక్కసారిగా కుప్పకూలాడు. దీంతో అక్కడ ఉన్న బంధువులు హుటాహుటిన పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడి వైద్యులు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లగా పరిశీలించిన వైద్యులు మృతిచెందినట్లు నిర్ధారించారు. తండ్రి సతీష్ నాయక్ ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్సై విశ్వనాథరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గిద్దలూరు రూరల్: మండలంలోని బురుజుపల్లె తండా గ్రామ శివారుల్లో నాటుసారా బట్టీని స్థానిక ఎకై ్సజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించి ధ్వంసం చేశారు. గ్రామ శివారుల్లో నాటుసారా తయారు చేస్తున్నారని సమాచారం అందడంతో ఎకై ్సజ్ శాఖ సీఐ జయరావు తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని నాటుసారా బట్టీని ధ్వంసం చేశారు. నాటుసారా తయారీ కేంద్రం సమీపంలో 3 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. అక్కడి పరిసర ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న బురుజుపల్లె తండాకు చెందిన చిన్ననాయక్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.


