గుంటూరు రూరల్: మండలంలోని చౌడవరంలోని చేతన పాఠశాలలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న రోటరీ డిస్ట్రిక్ట్ 3150 లీడర్షిప్ అవార్డ్స్ కార్యక్రమం బుధవారం ముగిసింది. తెలంగాణ, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి వివిధ ఇంటరాక్ట్ క్లబ్‌ల సభ్యులు పాల్గొన్నారు. ఈ రైలాను రోటరీ జిల్లా 3150 గవర్నర్ ఎలక్ట్ ముళ్లపూడి హరిహరప్రసాద్ ప్రారంభించారు. కార్యక్రమంలో మోటివేషనల్ స్పీకర్ ప్రదీప్ మాట్లాడుతూ విద్యార్థులు తమ లక్ష్యాలను నిర్ణయించుకుని వాటిని సాధించుకోవాలన్నారు. వ్యక్తిత్వ నిపుణులు డాక్టర్ సరస్వతిప్రదీప్ మాట్లాడుతూ ఆధునిక యుగంలో జరుగుతున్న మార్పులకు పిల్లలు పాజిటివ్‌గా స్పందించాలని కోరారు. గోకరాజు హైమావతి మాట్లాడుతూ నైతికత, విలువల గురించి, లక్ష్మీనారాయణ నాయకత్వ లక్షణాల గురించి వివరించారు. రోటరీ జిల్లా 3150 గవర్నర్ నామినీ ప్రసాద్ మాట్లాడుతూ రోటరీ గుంటూరు ఆదర్శ్ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షురాలు అన్నే శివకుమారి, కార్యదర్శి జవ్వాది జయశ్రీ, కోశాధికారి విజయ, రైలా క్యాంపు కన్వీనర్ మన్నే అనూరాధ, అశోక, రాణి, గాయత్రీ, డాక్టర్ పద్మజ, రైలా చైర్మన్ మామిడి సుబ్బారావు, ఈదర గిరీష్, చేతన రఘురామ్, మరుధ్వతి, రోటరీ పూర్వ గవర్నర్లు వడ్లమాని రవి, అన్నే రత్న ప్రభాకర్, తాళ్ల రాజశేఖర్, క్లబ్ సభ్యులు సునీత, శివరంజని పాల్గొన్నారు.
ఒంగోలువన్‌టౌన్: జిల్లాలోని ఎస్సీ యువతకు ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల సహకార ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారంతో ఎస్సీ యువతకు వివిధ రంగాల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార సంఘం లిమిటెడ్ కార్యనిర్వాహక సంచాలకులు కె.అర్జున్‌నాయక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో గుర్తించిన శిక్షణ కేంద్రాల్లో ఒకటైన ఒంగోలు భాగ్యనగర్ 4వ లైన్, 11వ అడ్డ రోడ్డులో ఉన్న డీఆర్డీఏ–టీటీడీసీలో జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ కోర్సులో శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. బీటెక్ అర్హత కలిగిని ఎస్సీ అభ్యర్థులు ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అదే విధంగా ఇండియా–ఇశ్రాయేల్ ఫ్రేమ్‌వర్క్ అగ్రిమెంట్లో భాగంగా ఏఎన్ఎం, జీఎన్ఎంఈ, బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన అర్హులైన ఎస్సీ మహిళా అభ్యర్థులకు ఇశ్రాయేల్ దేశంలో హోంబేస్డ్ కేటగిరీ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఎంపికై న అభ్యర్థులకు నెలకు రూ.2 లక్షల వరకు వేతనంతో ఉద్యగావకాశాలు ఉన్నట్లు తెలిపారు.


