న్యూస్‌రీల్
రెండేళ్లకే ప్రజల్లో వ్యతిరేకత..
అధికారుల మీద
నెట్టేందుకు కుట్రలు..
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పడిపోతున్న కూటమి గ్రాఫ్
గత రెండేళ్లలో అన్నీ రంగాల్లో ఘోరంగా విఫలం
సంజీవని వేదిక సాక్షిగా స్వయంగా అంగీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
52 ప్రభుత్వ సేవల్లో 45 బిలో యావరేజ్ అంటూ బహిరంగ ప్రకటన
రాష్ట్రంలో గిద్దలూరు నియోజకవర్గం 133 వ స్థానంలో ఉందన్న సీఎం
ఎస్సీ రెసిడెన్షియల్ స్కూళ్లను సరిగా నిర్వహించాలని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామికి హితవు
గతంలో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పనితీరు బాగాలేదని అసంతృప్తి
రెండేళ్లకే కూటమి ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
చంద్రబాబు పాలనలో టీడీపీ నాయకుల అవినీతి, అక్రమాలు పెచ్చుమీరి సంక్షేమం, అభివృద్ధి పడకేశాయి. ప్రభుత్వ సేవలు అందక ప్రజల్లో అలజడి నెలకొందని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబే కేఎస్‌పల్లి సభలో స్వయంగా అంగీకరించడం గమనార్హం. 52 ప్రభుత్వ సేవల్లో 45 బిలో యావరేజ్ అని ప్రకటించడం, మంత్రి స్వామి, ఎమ్మెల్యే ముత్తుముల పనితీరుపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేయడం కూటమి పాలనకు అద్దం పడుతోంది. పాలనలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రజలు చర్చించుకుంటున్నారు.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు:
రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే అన్నీ రంగాల్లో విఫలమైంది. అంతులేని అవినీతి, అడ్డూ అదుపులేని అరాచకాలు, భూ కబ్జాలు, మహిళలపై దాడులు, ఎటు చూసినా గంజాయి, మద్యం తాగి రెచ్చిపోతున్న మందుబాబులతో క్షీణించిన శాంతి భద్రతలతో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కూడగట్టుకుంది. ప్రజా ప్రతినిధులు రేషన్ మాఫియాలకు కొమ్ముకాస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇసుక, మట్టిని కూడా వదిలిపెట్టకుండా అమ్ముకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. స్వయంగా ప్రజా ప్రతినిధుల కనుసన్నల్లోనే ఈ అక్రమాలు జరుగుతుండడంతో ప్రజలు మాట్లాడలేని దుస్థితి నెలకొంది. మరోవైపు ప్రభుత్వ సేవలన్నీ పూర్తిగా మూలనపడ్డాయి. శనివారం గిద్దలూరు మండలం కేఎస్‌పల్లిలో సంజీవని పథకాన్ని ప్రారంభించడానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఈ విషయాలను ప్రకటించారు. లెక్కలతో సహా కూటమి వైఫల్యాల గుట్టు విప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమన్నారంటే...
రాష్ట్రంలో అమలవుతున్న ప్రభుత్వ సేవల గురించి మనమిత్ర యాప్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించుకుంటున్నానని చంద్రబాబు చెప్పారు. ప్రభుత్వానికి వచ్చిన రిపోర్టు ప్రకారం మార్కాపురం జిల్లా రాష్ట్రంలో 26వ స్థానంలో ఉందని తేల్చి చెప్పారు. జిల్లాలో మొత్తం 52 ప్రభుత్వ సేవలకు గాను 45 సేవలు బిలో యావరేజ్‌గా ఉన్నాయని స్పష్టం చేశారు. అంటే 90 శాతం సేవలు ప్రజలకు సక్రమంగా అందడం లేదని ముఖ్యమంత్రి స్వయంగా అంగీకరించినట్లేనని ఇక్కడి ప్రజలు చర్చించుకుంటున్నారు. జూన్ నెలలో ఇప్పటి వరకు అందిన రిపోర్టుల ప్రకారం 39 సేవల్లో పూర్తిగా వెనకబడి ఉన్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ భరోసా, అన్నా క్యాంటిన్, వీధి దీపాలు, గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సమస్య, మెప్మా, పారిశుధ్యం, పట్టణ ప్రాంతాల్లో తాగునీరు, ఆర్టీసీ బస్సులు, బస్సు స్టేషన్లు, రవాణా శాఖ, వైద్యరంగం, సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు, దీపం, అంగన్‌వాడీ సేవల్లో పూర్తిగా విఫలమైనట్లు చెప్పారు. ఈ లెక్కన అన్నీ ప్రధాన రంగాల్లో ప్రజలకు సక్రమంగా సేవలందడంలేదన్న నిజం స్పష్టమైంది. రెండేళ్లలోనే కూటమి పాలకులు చేతులెత్తేశారన్న సంగతి బయటపడింది.
కందులపై కూడా గుర్రు..
గతంలో మార్కాపురం పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. కందుల పనితీరు ఏమాత్రం బాగా లేదని తీవ్ర అసంతృప్తి ప్రకటించారు. పద్ధతి మార్చుకోవాలని సూచించారు. ఆ తరువాత శ్రీశైలం పర్యటన సందర్భంగా కూడా కందుల నారాయణ రెడ్డి, అశోక్ రెడ్డిల మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. జిల్లాలో అనేక మంది ఎమ్మెల్యేల పనితీరు పట్ల ఆయన తరచుగా అసహనం వ్యక్తం చేస్తుండడం గమనార్హం. దర్శి ఇన్‌చార్జి స్పీడుగా ఉన్నారని, ఆమెను మార్చాలని భావిస్తున్నట్లు కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. యర్రగొండపాలెం ఇన్‌చార్జిని తొలగించి త్వరలోనే త్రిసభ్య కమిటీ వేయాలని ఆలోచిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
133వ స్థానంలో గిద్దలూరు నియోజకవర్గం...
రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా మనమిత్ర సర్వేలో గిద్దలూరు నియోజకవర్గం 133వ స్థానంలో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగంగా ప్రకటించడం ఈ ప్రాంత ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా అనేక పర్యాయాలు గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పనితీరు పట్ల ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి వ్యకం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఎమ్మెల్యే అవినీతి, అక్రమాల గురించి క్లాస్ తీసుకున్నట్లు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సైతం చెవులు కొరుక్కున్నారు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి అదే విషయాన్ని ప్రస్తావించారు. అంతేకాకుండా గిద్దలూరు ప్రజల్లో అలజడి కనిపిస్తుందని చెప్పారు. జిల్లాలోని సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు కూడా బిలో యావరేజ్‌లో ఉన్నట్లు చెప్పిన సీఎం మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి సరిచూసుకోవాలని వేదిక మీద నుంచే హితవు పలికారు. మంత్రి పనితీరు బాగాలేదని అధిష్టానం భావిస్తుందని జిల్లాలో ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడం గమనార్హం.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలో పరిస్థితులు మారిపోయాయి. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న జిల్లాలో దాడులు, అరాచకాలు, విచ్చలవిడి అవినీతి పెరిగిపోయాయి. ప్రజా ప్రతినిధులే మద్యం వ్యాపారులు, రేషన్ మాఫియా నుంచి భారీ మొత్తంలో నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మార్కాపురం జిల్లా ఏర్పాటైన తరువాత కీలక ఎమ్మెల్యే అవినీతిలో విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. మట్టి, మద్యం, ఇసుక, బియ్యం వంటివి ఏమీ వదిలిపెట్టడంలేదని, ఎవరైనా ప్రశ్నిస్తే ఆయన సోదరుడు రంగ ప్రవేశం చేస్తున్నాడని జనాలు భయపడిపోతున్నారు. మరో ఎమ్మెల్యే తన రెస్టారెంటులోనే బ్రాండెడ్ మద్యం విక్రయాలు చేస్తూ బయట దుకాణాల్లో నాసిరకం మద్యం విక్రయాలు చేయిస్తున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఎమ్మెల్యేలంతా అభివృద్ధిలో కాకుండా అవినీతిలో పోటీ పడుతున్నారని జనాలు మండిపడుతున్నారు. రాష్ట్రంలోనే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పొగాకు సాగు ఎక్కువగా చేస్తారు. పొగాకుకు గిట్టుబాటు ధరలు రాక 45 రోజులకు పైగా రైతు రోడ్డెక్కి ఉద్యమాలు చేస్తుంటే జిల్లాలో పొగాకు పండించే ప్రాంతాలకు చెందిన ఒక్క ఎమ్మెల్యే కూడా రైతులను పలకరించకపోవడంతో రైతులు భగ్గుమంటున్నారు. దీంతో జిల్లా ఎమ్మెల్యేలపై జనాల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా గుణపాఠం చెబుదామని ఎదురు చూస్తున్నారని ప్రజా సంఘాల నాయకులు చెబుతున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ సేవలు ప్రజలకు అందకపోవడానికి అధికారులే కారణమన్న రీతిలో వ్యవహరించడంపై ఉద్యోగ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. అధికారులను వేదిక మీదకు ఎక్కించి ప్రజల ముందు దోషులుగా నిలబెట్టే ప్రయత్నాలు చేయడం తగదని చెబుతున్నారు. నిజానికి మార్కాపురం జిల్లా వెనకబాటుకు కారణం కూటమి పాలకులేనని స్పష్టం చేస్తున్నారు. మార్కాపురం కేంద్రంగా జిల్లాను ప్రకటించిన చంద్రబాబు ఈ ఆరు నెలల్లో కనీసం ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదని గుర్తు చేస్తున్నారు. కేవలం రూ.50 కోట్లు మాత్రం మంజూరు చేశారని అది కూడా ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలకు కేటాయించినట్లు అధికారులు చెబుతున్నారు. ఒక్క రూపాయి నిధులు లేకుండా ప్రభుత్వ సేవల్లో జిల్లా ఎలా పరుగులు పెడుతుందో ముఖ్యమంత్రే చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా గత ఏడాది ఆగస్టులో ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి నేటి వరకు ఒక్క కొత్త బస్సు కూడా కొనుగోలు చేయలేదు. ఉన్న పాత డొక్కు బస్సులతోనే ఆర్టీసీ ఉద్యోగులు మమ అనిపిస్తున్నారు. ఆర్టీసీ బస్సు స్టేషన్ల నిర్మాణం గురించి కూడా పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు మనమిత్ర సర్వేలో ఆర్టీసీ వెనకబడి ఉందని చెప్పడం పట్ల ఆర్టీసీ ఉద్యోగుల సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఆర్టీసీని దెబ్బ తీస్తున్న ప్రభుత్వమే రాళ్లు వేయడం మంచిపద్ధతి కాదని, తప్పు తనవైపు పెట్టుకొని అధికారులను బాధ్యులను చేసే కుయుక్తులు మానుకోవాలని హితవు చెబుతున్నారు.


