వెలిగొండపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు | - | Sakshi
Sakshi News home page

వెలిగొండపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు

Jun 29 2026 12:53 AM | Updated on Jun 29 2026 12:53 AM

ప్రతిపాదనలు పంపితే పనులు అవుతాయా అని స్థానిక ఎమ్మెల్యేపై చురకలు కల్తీ నెయ్యి అంటూ భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి

గిద్దలూరు రూరల్‌: వెలిగొండ ప్రాజెక్టును తానే ప్రారంభించి పూర్తి చేస్తానన్న సీఎం చంద్రబాబు నాయుడు మాటల్లో వాస్తవం లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కేపీ నాగార్జునరెడ్డి అన్నారు. గిద్దలూరు మండలం కేఎస్‌పల్లె వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన అబద్ధపు మాటలకు నిరసనగా కేపీ నాగార్జునరెడ్డి ఆదివారం పట్టణంలోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వెలిగొండ ప్రాజెక్టు పనుల్లో భాగంగా రెండు టన్నల్‌ పనులను పూర్తి చేసిన ఘనత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి దక్కుతుందన్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు చంద్రబాబునాయుడు తక్కువ బడ్జెట్‌ నిధులు విడుదల చేయడమే కాకుండా నిర్వాసితుల నష్టపరిహారంలో సైతం అన్యాయం చేస్తున్నాడన్నారు. జగనన్న ప్రభుత్వంలో తిరుమల లడ్డు ప్రసాదంలో ఎటువంటి కల్తీ జరగలేదని సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో సిట్‌ అధికారులు నిగ్గుతేల్చి చంద్రబాబుకు మొట్టికాయలు వేసినా బుద్దిలేకుండా తిరుమల లడ్డులో నెయ్యి కల్తీ జరిగిందంటూ అవే అబద్ధాలను ప్రజలకు వివరించాలని చూడటం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. కల్తీ నెయ్యి అంటూ పదే పదే ప్రజలను తప్పు దోవ పట్టించే చర్యలను భగవంతుడు క్షమించడన్నారు. జగనన్న ప్రభుత్వంలో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చుచేసి వాటి రూపు రేఖలు మార్చాడన్నారు. అప్పటి నుంచే ప్రైవేటు పాఠశాలలో నుంచి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు. యూరియా సరఫరా చేయలేక యూరియా వాడిన పంటలను విక్రయించడం చాలా కష్టంగా ఉందని ముఖ్యమంత్రే ప్రజల సాక్షిగా మాయమాటలు చెప్పడం మంచి పద్ధతి కాదన్నారు. రైతుల కష్టాలను పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం రైతుల శ్రమను అవహేళన చేస్తోందన్నారు. సంజీవని కార్యక్రమం ద్వారా ప్రజలకు పూర్తి స్థాయిలో మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయనడంలో వాస్తవం లేదన్నారు. సీఎం సభలో కేవలం 1500 కుర్చీలు మాత్రమే వేసి..అవి కూడా సగం ఖాళీగా ఉంటే.. సీఎం చంద్రబాబు సభ భారీగా నిర్వహించామని టీడీపీ నాయకులు ప్రచారం చేసుకోవడంపై జనం నవ్వుకుంటున్నారన్నారు. బహిరంగ సభలో సీఎం చంద్రబాబునాయుడే ప్రభుత్వ శాఖల పనితీరు బాగాలేదని, అలాగే రాష్ట్ర మంత్రి డోలా వీరాంజనేయస్వామి, స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి పనితీరు బాగలేదని నిజం ఒప్పుకున్నాడన్నారు. కేవలం నియోజకవర్గంలోని అభివృద్ధి పనుల విషయంలో ప్రతిపాదనలు ముఖ్యమంత్రికి పంపినంత మాత్రానే పనులు మంజూరైనట్లు స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ప్రజలను మోసగిస్తున్నాడన్నారు. నియోజకవర్గంలో ఇసుక మాఫియా రాజ్యమేలుతూ ప్రజలను నిలువునా దోచుకుంటున్నారన్నారు. మూడు సంవత్సరాలు ఓపికపడితే జగనన్న రాజ్యం రాబోతుందని ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీసీ నాయకులు కడప వంశీధరరెడ్డి, బి.ఓబులరావు, చేరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, మానం బాలిరెడ్డి, హనుమారెడ్డి, యర్రం వెంకటరామిరెడ్డి, పగడాల శ్రీరంగం, కాతా నరసింహారెడ్డి, సూరేపల్లి రామకృష్ణ, సూరా స్వామిరంగారెడ్డి, బొర్రా క్రిష్ణారెడ్డి, పాలుగుళ్ల నరసింహారెడ్డి, గోపాల్‌రెడ్డి, మత్తయ్య, మిత్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement