అధికార పార్టీ అండతో చెరువుల తవ్వకం కృష్ణాజిల్లాకు చెందిన వారికి లీజు ధేనువకొండలో టీడీపీ నేతల అక్రమాలు
సాక్షి టాస్క్‌ఫోర్స్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ నేతలు మట్టి, ఇసుకతోపాటు ప్రభుత్వ భూములనూ వదలడం లేదు. ఏకంగా ముంపు భూముల్లోనూ టీడీపీకి చెందిన కొందరు చెరువులు తవ్వి చేపల చెరువుకు లీజుకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వివరాలు.. గుండ్లకమ్మ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో మండలంలోని ధేనువకొండలో ప్రాజెక్టు ముంపులో రైతుల భూములు పోయాయి. ఆయా భూములకు ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం చెల్లించి స్వాధీనం చేసుకుంది. నదికి నీరు బాగా వచ్చిన సమయంలో నీరు ఆ భూముల్లో నిల్వ ఉంటుంది. ఈ భూమిపై గ్రామానికి చెందిన కొందరు పచ్చనేతల కన్ను పడింది.
చేపల చెరువులుగా ప్రభుత్వ భూమి
ధేనువకొండ గ్రామంలో గుండ్లకమ్మ ప్రాజెక్టులో పోయిన రైతుల భూమి సుమారు 252ఽ/2సీ తదితర సర్వే నంబర్లకు సంబంధించి 17 ఎకరాల వరకు ఉంది. ఈ భూములు నదీ ప్రవాహానికి దగ్గరలో ఉంటాయి. ఈ భూముల్లో గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నేతలు చేపల చెరువుల తవ్వకం చేపట్టారు. గత వారం రోజులుగా ఈ తవ్వకాలు చేపట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ భూముల్లో చేపల చెరువులు తవ్వి కృష్ణా జిల్లాకు చెందిన వారికి లీజుకు ఇవ్వనున్నట్లు సమాచారం. ఒక్కో ఎకరాకు మొదటి సంవత్సరం రూ.25 వేలు, తరువాత లీజు పెంచి ఇవ్వడానికి వారు అంగీకరించినట్లు సమాచారం.
వర్షాల సమయంలో ఇబ్బంది..
ఈ చెరువులకు ఏర్పాటు చేసిన కట్టల వలన, ముంపునకు గురికాని రైతుల భూముల్లో నుంచి వరద నీరు గుండ్లకమ్మ నదిలోకి చేరేందుకు ఈ చెరువులు అడ్డంకిగా మారతాయని స్థానికులు చెబుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం కాకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.


