వెలిగొండ ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అమలులో 1500 కుటుంబాలకు అన్యాయం ఒక్క గొట్టిపడియ గ్రామంలోనే 60 కుటుంబాలకు చెందిన 200 పేర్లు గల్లంతు అర్హులైనప్పటికీ రూ.25 కోట్లు ఎగ్గొట్టేందుకు చంద్రబాబు సర్కారు కుట్ర పాలకులు పట్టించుకోవడం లేదని బాధితుల ఆవేదన
బాబు ఇంతేనయా..
మార్కాపురం రూరల్/మార్కాపురం: సాగునీటి ప్రాజెక్టుల పేరుతో రైతుల భూములను, నివాసాలను తీసుకుని, వారికి దక్కాల్సిన పరిహారం విషయంలో కఠినంగా వ్యవహరించడం చంద్రబాబు సర్కారుకు అలవాటుగా మారింది. తాజాగా వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు దీనికి అద్దం పడుతోంది. వివరాల్లోకి వెళ్తే.. పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పరిధిలోని 11 గ్రామాల్లో 2019 సంవత్సరం నాటికి 18 ఏళ్లు నిండిన 7350 కుటుంబాలతో పాటు, ప్రభుత్వం గుర్తించి, గెజిట్లో మిస్సైన కుటుంబాలకు చెందిన మరో వెయ్యి మంది వరకు ఉన్నారు. ప్రభుత్వం ప్రకటించిన కటాఫ్ తేదీ 2019 అక్టోబర్ అనంతరం గడచిన ఎనిమిదేళ్లలో 18 సంవత్సరాల వయసు నిండిన యువతీ, యువకులకు వివాహాలు జరిగి కుటుంబాలుగా విడిపోయిన వారు 11 గ్రామాల పరిధిలో దాదాపు 1500 కుటుంబాలు పైగా ఉన్నారు. వారందరి వివరాలను సేకరించి నిర్వాసితుల జాబితాలో చేర్చాలన్న డిమాండ్‌ను సర్కారు పెడచెవిన పెట్టింది. మూడు జిల్లాల రైతులు, ప్రజల కోసం, సర్వం త్యాగం చేసి, పుట్టి పెరిగిన గ్రామాలను ఖాళీ చేసేందుకు సిద్ధపడి, త్యాగం చేసిన నిర్వాసితులపై ఉదారంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం సవతి ప్రేమ చూపడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెలుగొండ ప్రాజెక్టును పరిశీలించేందుకు శనివారం రానున్నారు.
గొట్టిపడియలో రూ.25 కోట్లు ఎగనామం
మార్కాపురం జిల్లా మార్కాపురం మండలం గొట్టిపడియ గ్రామానికి చెందిన 60 కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్‌అండ్‌ఆర్ (పునరావాసం, పునరుద్ధరణ) ప్యాకేజీని అడ్డగోలుగా ఎగ్గొట్టేందుకు కుట్ర పన్నింది. దాదాపు 200 మంది నిర్వాసితులకు దక్కాల్సిన రూ.25 కోట్ల పరిహారాన్ని లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించి, వారిని నట్టేట ముంచేందుకు సిద్ధమైంది. రేషన్ కార్డులు, ఆధార్, పాన్ కార్డులు వంటి అన్ని రకాల ధ్రువపత్రాలు గ్రామ చిరునామాతోనే ఉన్నప్పటికీ, అధికారులు ఉద్దేశపూర్వకంగానే వీరి పేర్లను జాబితాలో చేర్చలేదు. ఒక్కొక్కరికి రూ.12.50 లక్షల చొప్పున పరిహారం దక్కాల్సి ఉండగా, ప్రభుత్వం కుట్రపూరితంగాా ఈ కుటుంబాలను మినహాయించింది.
ఒకే కుటుంబంలో వివక్ష
అధికారుల వివక్ష ఏ స్థాయిలో ఉందంటే.. ఒకే కుటుంబంలో కొడుకు పేరు జాబితాలో ఉండగా, అదే కుటుంబంలోని తల్లి పేరును తొలగించారు. ఈ విచిత్రమైన, అన్యాయపూరితమైన నిర్ణయానికి ప్రాతిపదిక ఏంటో చెప్పాలని బాధితులు అడిగినా అధికారులు సమాధానం దాటవేస్తున్నారు. తమ ఇళ్లను ‘కొత్త ఇళ్లు‘గా నమోదు చేసి, ప్యాకేజీ నిలిపివేయడం వెనుక భారీ కుట్ర ఉందని నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం జరగాలని అధికారులను బతిమాలినా ఫలితం లేకపోవడంతో, ‘మేము ఏం పాపం చేశాం?’ అంటూ బాధితులు నిలదీస్తున్నారు.
పోరాటమే మార్గం!
తమ హక్కులను కాలరాసి, రూ.25 కోట్ల పరిహారాన్ని ఎగ్గొట్టాలని చూస్తున్న సర్కారు తీరుపై నిర్వాసితులు మండిపడుతున్నారు. వెంటనే స్పందించి అర్హులైన ప్రతి కుటుంబానికి ప్యాకేజీ వర్తింపజేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ప్రభుత్వం దిగివచ్చే వరకు రోడ్లపైకి వచ్చి ధర్నాలు, ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. తమ హక్కుల కోసం ఎంతవరకు పోరాడానికై నా సిద్ధమని వారు స్పష్టం చేస్తున్నారు.
60 కుటుంబాలకు న్యాయం చేయాలి
గ్రామం అధికారులు చుట్టూ తిరిగిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ లో పేర్లు రాకపోవడం అందరూ ఊర్లో ఉండి వారికి ప్యాకే జీ రాకపోవడం చాలా బాదాకరంగా ఉంది.అన్ని అధారాలు ఉన్న లిస్టులో పేరు రాలేదు.60 కుటుంబాలకు న్యాయం చేయాలి.
– తుమ్మ వెంకటరెడ్డి, మాజీ సర్పంచ్, గొట్టిపడియ
నిర్వాసితులపై కపట ప్రేమ
2016, 2017లో వెలిగొండ నిర్వాసితులు తమ సమస్యలు పరిష్కరించాలని అప్పటి ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోలేదు. గొట్టిపడియ, గుండంచర్ల గ్రామ నిర్వాసిత కాలనీలో మౌలిక సౌకర్యాలు కరువయ్యాయి. సదరు రెండు గ్రామాల నిర్వాసితులకు నేటికీ నివేశన స్థల పట్టాలు ఇవ్వకపోవడం ప్రభుత్వ తీరుకు నిదర్శనం. వెలుగొండ ప్రాజెక్టు నల్లమలసాగర్‌కు నీటిని విడుదల చేసి గ్రామాలను ఖాళీ చేసేందుకు, సదరు నిర్వాసితులు గృహాలు నిర్మించుకునేందుకు కనీసం ఆరు నెలల సమయమైనా పడుతుంది. రేపు నీరు విడుదల చేసి మరుసటి రోజు ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తే నిర్వాసితులు ఎక్కడ తలదాచుకుంటారు. నిర్వాసితుల త్యాగాన్ని కేవలం డబ్బుతో కొలవవద్దు. వారిపట్ల ఉదారంగా వ్యవహరించాలి.
– డీకేఎం రఫీ, సీపీఎం నాయకుడు


