వైద్యసేవలు అంతంతే..
సాక్షి ప్రతినిధి, ఒంగోలు:
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పేరుకు 50 వరకు పీహెచ్‌సీలు ఉన్నాయి. 15 యూపీహెచ్‌సీలు ఉన్నాయి. ఒంగోలు, మార్కాపురంల్లో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రులు ఉన్నాయి. మార్కాపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించినా ఇక్కడ ఎలాంటి వైద్య సౌకర్యాలు లేవు. ప్రజారోగ్యానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జీజీహెచ్‌కు 76 మంది వైద్యులను కేటాయించగా చంద్రబాబు ప్రభుత్వం రాగానే వారందరినీ బదిలీ చేసింది. ఇప్పుడు కేవలం 20 మంది వైద్యులు మాత్రమే మిగిలారు. జీజీహెచ్ పరిస్థితి ఇలా ఉంటే పీహెచ్‌సీల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. గత ప్రభుత్వంలో ఒక్కో పీహెచ్‌సీకి ఇద్దరు వైద్యులను నియమించారు. నల్లమల అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న దోర్నాల, యర్రగొండపాలెం, గిద్దలూరు, కంభం మండలాల్లోని ప్రభుత్వ వైద్యశాలల్లో వైద్యుల కొరత వేధిస్తోంది. యర్రగొండపాలెం ప్రభుత్వ 100 పడకల ఆస్పత్రిలో 22 మంది వైద్యులకు గాను 15 మంది మాత్రమే ఉన్నారు. రెగ్యులర్ రేడియాలిస్ట్ పోస్టు ఖాళీగా ఉంది. దాంతో పీజీలను కాంట్రాక్ట్ పద్ధతిలో వినియోగిస్తున్నారు. సివిల్ సర్జన్, జనరల్ మెడిసిన్ వైద్యుల కొరత ఉంది. ముగ్గురు గైనకాలజిస్టులకు గాను ఇద్దరు మాత్రమే ఉన్నారు. పీడియాట్రిక్ సీఎస్‌ఎస్ కూడా లేకపోవడంతో జనాలు ఇబ్బంది పడుతున్నారు. గిద్దలూరు 100 పడకల ఆస్పత్రిలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ ముగ్గురు గైనకాలజిస్టులకు గాను ఒక్కరు మాత్రమే ఉన్నారు. కాన్పుల కోసం ఆస్పత్రికి వచ్చిన గర్భిణులు అనివార్యంగా ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తుందని వాపోతున్నారు. జనరల్ డాక్టర్ లేరు. స్టాఫ్‌నర్సు పోస్టు ఒకటి ఖాళీగా ఉంది. ఎంతో ముఖ్యమైన ఫార్మాసిస్టు పోస్టు కూడా ఖాళీగా ఉంది. ఇలా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎక్కడ చూసినా వైద్యుల కొరత కనిపిస్తోంది.
వారానికి ఒకసారే సిజేరియన్ ఆపరేషన్లు...
నల్లమల అటవీ ప్రాంతానికి సమీపంలోని దోర్నాల ప్రభుత్వ ఆస్పత్రిలో వింత పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఇద్దరు గైనకాలజిస్టులకు గాను ఒక్కరు మాత్రమే ఉన్నారు. అంతేకాకుండా అనస్తీషియన్ లేకపోవడంతో సిజేరియన్ ఆపరేషన్లకు ఇబ్బందిగా మారింది. దాంతో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి ఇక్కడ ఒక అనస్తీషియన్‌ను కేటాయించారు. వారానికి ఒకసారి మాత్రమే దోర్నాలకు వచ్చి పోతుంటారు. అనస్తీషియన్ డ్యూటీకి వచ్చిన రోజు మాత్రమే ఆపరేషన్లు చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ అత్యవసరంగా సిజేరియన్ చేయాల్సి వస్తే ప్రైవేటు వైద్యశాలలే దిక్కవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
నిరుపయోగంగా ఆక్సిజన్ ప్లాంట్...
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో కంభం ప్రభుత్వ వైద్యశాలలో కోటి రూపాయలు వెచ్చించి ఆక్సిజన్ ప్లాంటు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దాన్ని పక్కన పడేశారు. హైవే రోడ్డు ఏర్పాటు చేసిన తరువాత ఇటీవల కాలంలో కంభంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువయ్యాయి. ప్రమాదంలో గాయపడిన వారికి ఒక్కోసారి ఆక్సిజన్ అవసరం ఉంటుంది. గుండె జబ్బుల్లో కూడా కొంతమందికి ఆక్సిజన్ అవసరమవుతుంది. ప్రభుత్వ వైద్యశాలలో ఉన్న ఆక్సిజన్ ప్లాంటును వినియోగంలోకి తీసుకొస్తే ప్రాణాపాయంలో ఉన్న వారికి ఉపయోగపడుతుంది. ఈ సమస్య కూటమి పాలకులకు పట్టడంలేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అనేక పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీల్లో మందులను బయటి మెడికల్ షాపులకు రాసిస్తున్నట్లు రోగులు ఆరోపిస్తున్నారు. అనేక ప్రభుత్వ వైద్యశాలల్లో కనీసం బ్యాండేజీ క్లాత్, దగ్గు మందులు, ఆయింట్‌మెంట్లు లేవని తెలుస్తోంది.
సంజీవని పేరుతో నాటకాలు...
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్ద పీట వేసింది. ప్రతి గ్రామంలోనూ సచివాలయాలకు సమానంగా విలేజి క్లినిక్‌లను ఏర్పాటు చేసి గ్రామీణ ప్రజలకు అండగా నిలిచింది. జగనన్న సురక్ష పథకంలో పట్టణం, గ్రామం అనే తేడా లేకుండా ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి రోగుల వివరాలను డిజిటలైజ్ చేసింది. అంతేకాకుండా రోగులను ఎప్పుటికప్పుడు ఫాలో చేయడం, మందులు వేసుకుంటున్నారో లేదో గమనించడం, దీర్ఘకాలిక రోగులు రెగ్యులర్‌గా ఆస్పత్రికి వచ్చి చికిత్స కొనసాగించేలా చేయడం వంటివి అందులో పొందుపరిచారు. ఎన్నికలు రావడంతో అది ఆగిపోయింది. ఇప్పుడు దాన్నే కూటమి ప్రభుత్వం సంజీవని పేరుతో కలరింగ్ ఇస్తోంది. పేషంట్ కేర్ కో ఆర్డినేటర్లను నియమించి వారి ద్వారా రోగుల వివరాలను డిజిటలైజ్ చేస్తామని, రోగి వైద్య చికిత్స కొనసాగించేలా వారు చూస్తారని చెబుతోంది. పాత పథకాలకు కొత్త పేర్లు పెట్టడం, ఎల్లో మీడియాలో కొత్త పథకంలాగా ప్రచారం చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు శనివారం గిద్దలూరు మండలంలోని కేఎస్ పల్లిలో సంజీవని పథకాన్ని ప్రారంభిస్తుండడంతో జనాలు జగనన్న సురక్షను మరోసారి గుర్తు చేసుకుంటున్నారు.
గిద్దలూరు రూరల్: సీఎం చంద్రబాబు సంజీవని పథకం ప్రారంభించేందుకు గిద్దలూరు వస్తున్నారు. ఇక్కడ ప్రాంతీయ వైద్యశాలను ఒకసారి పరిశీలిస్తే..అన్నీ సమస్యలే కనిపిస్తున్నాయి. వారానికి వెయ్యి ఓపీలు ఉంటాయి. స్పెషలిస్ట్ వైద్యులు ఉన్నప్పటికీ అందుకు తగ్గట్టుగా అత్యాధునిక వైద్య పరికరాలు లేవు. దీంతో రోగులు దూర ప్రాంతాలకు వెళ్లి వైద్య సేవలు పొందాల్సిన పరిస్థితి నెలకొంది. ఆస్పత్రిలో ఆపరేషన్ థియేటర్ ఉంది. అయితే శస్త్రచికిత్స చేసేందుకు అవసరమైన పరికరాలు అందుబాటులో లేవు. ఎముకల శస్త్రచికిత్స నిపుణులు ఉన్నా పరికరాలు లేకపోవడంతో ఆపరేషన్లు జరగడం లేదు. గైనకాలజిస్టులు ముగ్గురు ఉండాల్సి ఉండగా కేవలం ఒక్కరు మాత్రమే ఉన్నారు. ఫలితంగా మహిళలు అవస్థలు పడుతున్నారు. రేడియాలజిస్టు పోస్టు ఖాళీగా ఉంది. సీటి స్కానింగ్ లేదు. అంబులెన్స్ మరమ్మతులకు గురైంది. 3 నెలలుగా వైద్యశాలలో పక్కన పడేసి ఉంచారు. ఆల్ట్రాసౌండ్ మిషన్ పాతది కావడంతో మొరాయిస్తోంది. గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాల 100 పడకల వైద్యశాలగా రికార్డుల ప్రకారం ఉన్నప్పటికీ వైద్యశాలలో కేవలం 80 పడకలు మాత్రమే ఉన్నాయి. ప్రధానమైన ప్రభుత్వ వైద్యశాలలోనే ఇన్ని సమస్యలు తిష్టవేసుకుని కూర్చుంటే మారుమూల ప్రాంతంలోని కేఎస్.పల్లెలోని పీహెచ్‌సీలో కొత్తగా సంజీవని ప్రజల ప్రాణాలను నిలబెడుతుందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ప్రజలు పెదవి విరుస్తున్నారు.
మార్కాపురం జిల్లాలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇటీవల మార్కాపురం సమీపంలోని పలకల క్వారీ వద్ద బస్సు ప్రమాదంలో 14 మంది మృత్యువాత పడగా 20 మందికి పైగా గాయపడడం తెలిసిందే. గాయపడిన వారికి అత్యవసరంగా చేయడానికి సిటీ స్కానింగ్ కోసం కొంతమందిని వెంటనే ఒంగోలు జీజీహెచ్ తరలించాల్సి వచ్చింది. తరచుగా ఇదే ఘటనలు పునరావృతమవుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. రోడ్డు ప్రమాదంలో ఎవరైనా తీవ్రంగా గాయపడ్డా, పక్షవాతం వచ్చి ప్రాణపాయంలో పడినా సిటీ స్కానింగ్ అవసరం చాలా ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు. అయినా మార్కాపురం జీజీహెచ్‌లో సిటీ స్కానింగ్ ఏర్పాటు చేయడానికి కూటమి పాలకులకు మనసొప్పడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గిద్దలూరు, యర్రగొండపాలెం 100 పడకల ఆస్పత్రుల్లో కూడా సిటీ స్కానింగ్ సౌకర్యం లేదు. కనీసం ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ తీయాలన్నా రేడియాలజిస్టులు లేరు.


