● నిలిచిన మార్కాపురం మెడికల్ కాలేజీ పనులు
మార్కాపురం: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెడికల్ కాలేజీ పనులు ఆగిపోయాయి. ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు పనులను నిలిపేసింది. దీంతో ఆ ప్రాంతమంతా చిల్లచెట్లతో నిండిపోయింది. నిర్మాణ సంస్థ కూడా అక్కడున్న మెటీరియల్‌ను తరలించింది. దీంతో మార్కాపురం జిల్లా ఇచ్చారన్న ఆనందం ఈ ప్రాంత ప్రజల్లో కనిపించడం లేదు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో మార్కాపురం వద్ద ప్రారంభించిన మెడికల్ కాలేజీ ఎన్నికల నాటికి దాదాపు 70 శాతం పూర్తికాగా కూటమి ప్రభుత్వం రాగానే చీకట్లు కమ్ముకున్నాయి. ఇదే సమయంలో 76 మంది డాక్టర్లలో 350 పడకలతో రెండు ఆక్సిజన్ ప్లాంట్లతో రోజుకు 650 నుంచి 700 మధ్య ఓపీ ఉన్న జీజీహెచ్ లో వైద్యసేవలు తగ్గిపోయాయి. ప్రస్తుతం కేవలం 15 నుంచి 20 మంది డాక్టర్లు మాత్రమే రోగులకు సేవలు అందిస్తున్నారు. ఓపీ కూడా 300 మధ్య ఉంటోంది. క్రిటికల్ కేసులను ఒంగోలుకు రెఫర్ చేస్తున్నారు. నాడు వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మెడికల్ కళాశాలలో సిబ్బంది క్వార్టర్స్, నర్సింగ్ కళాశాల, జంట్స్, లేడీస్ హాస్టల్స్, సెంట్రల్ క్యాంటిన్ ఇలా అనేక భవన నిర్మాణ పనులను దాదాపు పూర్తయ్యాయి. జీజీహెచ్‌లో 420 బెడ్లను సిద్ధం చేసింది. ప్రస్తుతం ఇవన్నీ కనిపించడం లేదు. ప్రస్తుతం సెక్యూరిటీ గార్డు, ఒకరిద్దరు సిబ్బంది మాత్రమే ఉన్నారు. జీజీహెచ్‌లో కూడా అధునాతన మెడికల్ సామగ్రిని రాష్ట్రంలోని వివిధ మెడికల్ కళాశాలలకు, వైద్యశాలలకు తరలించారు. దీంతో ఇక్కడి సేవలు తగ్గిపోయాయి. మెరుగైన వైద్యసేవల కోసం ఒంగోలు, గుంటూరుకు తరలిస్తున్నారు.


