పాలనలో కూటమి పూర్తిగా విఫలం | - | Sakshi
Sakshi News home page

పాలనలో కూటమి పూర్తిగా విఫలం

Jun 27 2026 1:25 AM | Updated on Jun 27 2026 1:25 AM

ముండ్లమూరు: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేదు..రాష్ట్రంలో ఎక్కడా ఒక్క అభివృద్ధి పనీ జరగడం లేదు.. సంక్షేమం మూలన కూర్చుంది.. అభివృద్ధి అటకెక్కింది... రాష్ట్రంలో అప్పులు మాత్రం రూ.3.50 లక్షల కోట్లు దాటిపోతున్నాయి. మొత్తంగా కూటమి ప్రభుత్వం పరిపాలనలో పూర్తిగా విఫలమైందని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి స్పష్టం చేశారు. మండలంలోని పూరిమెట్ల గ్రామంలో పోలేరమ్మ అమ్మవారి తిరుణాళ్ల సందర్భంగా వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యుత్‌ ప్రభపై బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి చేయకపోయినా రూ.లక్షల కోట్ల అప్పులు ఎందుకవుతున్నాయని ప్రశ్నించారు. అప్పు చేసిన డబ్బంతా ఎటుపోతోందని ప్రభుత్వాన్ని నిలదీశారు. అన్నీ స్కాములు చేసి రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ప్రతి మహిళకు నెలకు రూ.1,500 ఇస్తామని, నిరుద్యోగులకు రూ.3 వేల భృతి అందిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. రెండేళ్లు గడిచినా వాటిని అమలు చేయలేదని విమర్శించారు. ఇప్పటి వరకు ఎన్నికల సమయంలో ఎవరినైతే కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందో ప్రతి కుటుంబానికి బూచేపల్లి కుటుంబం అండగా ఉంటుందన్నారు. వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలను ఇబ్బందులు పెట్టడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఎన్నికల సమయంలో, ఎన్నికలు అయిపోయిన తర్వాత కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ఏ ఒక్క నాయకుల్ని వదిలిపెట్టేది లేదని, దెబ్బకు దెబ్బ రుచి చూస్తారని స్పష్టం చేశారు. తాను దర్శి నియోజకవర్గంలోనే ఉంటాను, ఇక్కడే పోటీ చేస్తాను, ఏ వైఎస్సార్‌సీపీ కార్యకర్తకు ఇబ్బంది జరిగినా అండగా ఉంటానని అన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, చంద్రబాబు ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని మండిపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిందని వివరించారు. 2024లో అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోవడంతో 2029 ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ విజయం ఖాయమని, జగనన్న మళ్లీ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ మోసపు మాటలను ప్రజలు ఇకపై నమ్మరని బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మండల కన్వీనర్‌ చింతా శ్రీనివాస్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సూదిదేవర అంజయ్య, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి మేడికొండ జయంతి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుంకర బ్రహ్మానందరెడ్డి, డగ్లస్‌, గ్రామస్తులు,నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలను ఇబ్బంది పెడితే దెబ్బకు దెబ్బ రుచి చూస్తారు

2029లో జగన్‌ సీఎం కావడం ఖాయం

దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement