ఒంగోలు సిటీ: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దత్తత తీసుకున్న ఈదుమూడి గ్రామంలో గొర్రెల కాపరులపై దాడి జరిగినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈదుమూడి గ్రామంలో యాదవ కులానికి చెందిన గొర్రెల కాపరులపై జరిగిన దాడి ఘటనపై శుక్రవారం ఒంగోలులోని హైదరీ క్లబ్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. ఈనెల 7వ తేదీన ఈదుమూడిలో వడ్లమూడి మధు, యల్లావుల అనిల్ అనే గొర్రెల కాపరులపై ఉప్పల సుబ్బారావు, ఉప్పల వెంకటేశ్వర్లు తదితరులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారని, అంతేకాకుండా కులం పేరుతో దూషిస్తూ, మహిళలతో అత్యంత అసభ్యకరంగా ప్రవర్తించారన్నారు. దీనిపై నాగులుప్పలపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు (57/2026) నమోదై మూడు వారాలు గడుస్తున్నా, నిందితులను అరెస్టు చేయకుండా పోలీసులు ఎందుకు కాలయాపన చేస్తున్నారని ప్రజా సంఘాల నాయకులు ప్రశ్నించారు. నిజమైన బాధితులపైనే కాకుండా, నిందితుల పక్షాన కౌంటర్ కేసు (58/2026) నమోదు చేయడం వెనుక ఉన్న మతలబు ఏమిటని వక్తలు నిలదీశారు. బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి, నిందితుల కొమ్ము కాస్తూ, బాధితులను భయభ్రాంతులకు గురిచేయడం వెనుక అధికార పార్టీ అండదండలు ఉన్నాయన్నది స్పష్టమవుతోందని ఆరోపించారు. సీఎం దత్తత గ్రామంలోనే గొర్రెల కాపరులకు రక్షణ లేకపోతే, ఇక రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేశారు. ఈదుమూడి ఘటనలో నిందితులను కాపాడుతున్న అసలు సూత్రదారులు ఎవరు? అని సమావేశంలో వక్తలు ప్రశ్నించారు. వెంటనే 57/2026 కేసులో నిందితులను అరెస్టు చేయాలని, బాధితులపై బనాయించిన కౌంటర్ కేసును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని, ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే ప్రజా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర శతాబ్ది ఉత్సవ అధ్యక్షుడు బొట్లా రామారావు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో జాతీయ ఎరుకల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు మోహన్‌కుమార్ ధర్మా, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు దాసరి చెన్నకేశవులు, బీఎస్పీ రాష్ట్ర నాయకులు తాటిపర్తి వెంకటస్వామి, సమాజ్ వాది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాశం వెంకటేశ్వర్లు, ద్రవిడ దేశం పార్టీ అధ్యక్షులు కృష్ణారావు, అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దొడ్డక ఆంజనేయమూర్తి, జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు నాగమల్లేశ్వరి, బాపట్ల జిల్లా అధ్యక్షుడు తాడిబోయిన లక్ష్మీప్రసాద్, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు షేక్ అజీజ్, బీసీ నాయకులు గవిని శ్రీను, గుళ్లాపల్లి వీరభద్రాచారి, పులి హరికృష్ణ, ఆతిన వెంకటరావు, వడ్లమూడి భాస్కరరావు, జడ బాల నాగేంద్ర, బంకా చిరంజీవి, మసిముక్కు భాస్కర్, బాధితులు వడ్లమూడి మధు, ఎల్లావుల అనిల్, గొర్ల పెంపకం దారుల సంఘం నాయకులు కిలారు పెద్దబ్బాయి, తిరుపతిరావు, బుర్రి ఆంజనేయులు, ఫణిదపు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఈదుమూడిలో గొర్రెల కాపరులపై దాడిని ముక్త కంఠంతో ఖండించిన ప్రజా సంఘాలు
ఘటన జరిగి మూడు వారాలైనా నిందితులను అరెస్టు చేయకపోవడంపై నిలదీత
సీఎం దత్తత గ్రామంలోనే ఇంత అరాచకమా అని మండిపాటు


