మార్కాపురం రూరల్: ఆత్మహత్యకు పాల్పడబోతున్నానని పోలీసులకు సమాచారం అందించిన ఓ యువకుడిని అధికారులు సకాలంలో స్పందించి రక్షించారు. ఈ ఘటన శుక్రవారం మార్కాపురంలో చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ వంతెన వద్ద ఉన్న చాతరాశి వెంకట శివ (26) తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మార్కాపురం టౌన్ ఎస్సై విశ్వనాథరెడ్డికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. వెంటనే అప్రమత్తమైన ఎస్సై పోలీస్ సిబ్బందిని హుటాహుటిన సంఘటన స్థలానికి పంపారు. అక్కడ ఉన్న యువకుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీస్‌స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్ అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. యువకుడి ఆత్మహత్యాయత్నానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.
● డ్రైవర్, క్లీనర్‌కు తీవ్ర గాయాలు
హనుమంతునిపాడు: హైపో క్లోరైడ్ లోడుతో వెళ్తున్న ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో డ్రైవర్, క్లీనర్‌కు గాయాలయ్యాయి. శుక్రవారం కర్నూలు నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న ట్యాంకర్ హనుమంతునిపాడు మండలంలోని వేములపాడు ఘాట్ మలుపు వద్దకు రాగానే అదుపు తప్పి బోల్తా పడింది. ఈ క్రమంలో ట్యాంకర్ పల్టీ కొట్టి రోడ్డు పక్కన పడిపోవడంతో లోపల ఉన్న రసాయన ద్రవం బయటకు కారుతోంది. ప్రమాదంలో డ్రైవర్ ఎ.రాజశేఖర్, క్లీనర్ ఎస్.మహ్మద్ రఫీక్ తీవ్రంగా గాయపడ్డారు. అదే మార్గంలో వెళ్తున్న వాహనదారులు గమనించి వెంటనే 108 వాహనానికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను కనిగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు.
● తుమ్మలబైలు వద్ద కనిపించిన అడవిదున్న
పెద్దదోర్నాల: మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల మండల పరిధిలోని నల్లమల అభయారణ్యంలోని తుమ్మలబైలు గిరిజన గూడెం సమీపంలో అడవిదున్న సంచరిస్తూ స్థానికుల కంటపడింది. దీంతో కొందరు యాత్రికులు తమ వద్ద నున్న సెల్‌ఫోన్లలో అడవిదున్న సంచరిస్తున్న దృశ్యాలను బంధించి సోషల్ మీడియాలో పెట్టారు. 1870 కు ముందు ఒక్కసారిగా మాయమైన అడవిదున్న 152 ఏళ్ల తరువాత 2022లో నల్లమల అభయారణ్యంలోని గుండ్లబ్రహ్మేశ్వరం అడవుల్లో ప్రత్యక్షం కావటం అప్పట్లో చర్చనీయాంశఽమైంది. కొన్నేళ్ల తరువాత మార్కాపురం నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లోని పంట పొలాల్లో ప్రత్యక్షమైన అడవిదున్న కొన్ని రోజుల అనంతరం మళ్లీ నల్లమల అభయారణ్యంలో స్థానికులకు తారసపడటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ గౌర్, ఇండియన్ బైసన్‌గా పిలుచుకునే అడవిదున్నలు నీలగిరి, మధ్యప్రదేశ్ అభయారణ్యాల్లో ఎక్కువగా సంచరిస్తుంటాయి. వీటిని నల్లమల అభయారణ్యాలకు తరలించాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. కాగా అడవిదున్న సంచారంపై ఫారెస్ట్ రేంజి అధికారి హరిని సంప్రదించగా కొద్ది రోజులుగా గుండ్ల బ్రహ్మేశ్వరం, మార్కాపురం ఏరియాలో సంచరించిన అడవిదున్నే తిరిగి నల్లమల అభయారణ్యంలోకి ప్రవేశించి ఉండొచ్చని ఆయన తెలిపారు.


