● సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు డి.రమాదేవి ధ్వజం
ఒంగోలు టౌన్: పొగాకు బోర్డు రైతుల కోసం ఏర్పాటు చేశారో లేక కార్పొరేట్ల ప్రయోజనాల కోసం ఏర్పాటు చేశారో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జవాబు చెప్పాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు డి.రమాదేవి ప్రశ్నించారు. రైతులు లేకుండా పొగాకు బోర్డు ఎవరి కోసం, ఎందుకోసం ఏర్పాటు చెప్పాలన్నారు. పొగాకు రైతుల కోసం ఏర్పాటు చేసిన బోర్డులో రైతుల ప్రాతినిధ్యం లేకుండా పోయిందని, ఎవరో వచ్చి పెత్తనం చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొగాకు రైతుల సంక్షేమాన్ని విస్మరించి కార్పొరేట్ శక్తులకు తొత్తుగా మారిన బోర్డుకు రైతులు లేకుంటే ఉనికే ఉండదని ప్రభుత్వం గ్రహించాలని చెప్పారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు శుక్రవారం మూడో రోజుకు చేరాయి. రైతు కూలీ సంఘ జిల్లా నాయకురాలు ఎస్ లలిత కుమారి, ఏఐకేఎస్ నాయకురాలు బి.పద్మ అధ్యక్షత వహించిన ఈ దీక్షలో రమాదేవి మాట్లాడుతూ పొగాకు కొనుగోళ్లలో ప్రభుత్వం మాట చెల్లుబాటు కావట్లేదని, ఐటీసీ, జీపీఏ వంటి కార్పొరేట్ కంపెనీల ఆధిపత్యమే చెల్లుబాటవుతుందని విమర్శించారు. రైతుల శ్రమతో వేలాది కోట్ల రూపాయల ఆదాయం పొందుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం రూ.1000 కోట్లు కేటాయించి రైతులను ఆదుకోలేకపోవడం సిగ్గుచేటన్నారు. కంపెనీలకు బీమా వసతితో పాటు లాభాలు వస్తుంటే రైతులకు కష్టాలు, నష్టాలు వస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వం పొగాకు రైతులను ఆదుకోకుంటే ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ పొగాకు బోర్డు కంపెనీలకు గులాంగిరి చేస్తోందని, రైతుల ప్రయోజనాలను నిర్లక్ష్యం చేస్తూ బడా బాబుల వ్యాపార లాభాల కోసం పాటుపడుతోందని ఆరోపించారు. సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు మాట్లాడుతూ 45 రోజులుగా రైతులు రోడ్డెక్కి ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వం దిగిరాకపోతే శనివారం నుంచి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. జిల్లా నలుమూలల నుంచి రైతులు భారీగా తరలి వచ్చి తమ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. అప్పుడే ప్రభుత్వం దిగివస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా మాట్లాడుతూ కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు ఉండి కూడా పొగాకు రైతులకు న్యాయం చేయలేకపోవడం సిగ్గుచేటన్నారు. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వలేని మోదీ సర్కార్ దేశాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పడం హాస్యాస్పదం అన్నారు. ఈ శిబిరంలో రాష్ట్ర సేవా సమాఖ్య అధ్యక్షుడు బెజవాడ వెంకటరావు, రైతు నాయకులు ఎస్‌కే మాబు, సీఎస్ సాగర్, కంకణాల అంజనేయులు, నెరుసుల వెంకటేశ్వర్లు, మంజుల, కామేపల్లి శ్రీనివాసరావు, కంచర్ల సుబ్బారావు, వడ్డే హనుమారెడ్డి, కె.వీరారెడ్డి, శ్రీకాంత్, సింగయ్య, పమిడి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
నిరసన
దీక్షలు చేస్తున్న పొగాకు రైతులు


