పెద్దదోర్నాల/గిద్దలూరు రూరల్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం గిద్దలూరు మండలంలోని కిష్టంశెట్టిపల్లె, పెద్దదోర్నాల మండలం గంటవానిపల్లె వద్ద వెలుగొండ ప్రాజెక్ట్ కెనాల్ వద్ద పర్యటించనున్నారు. కిష్టంశెట్టిపల్లె ‘సంజీవని’ కార్యక్రమ ప్రారంభోత్సవం, బహిరంగ సభా స్థలం వద్ద భద్రతా ఏర్పాట్లను ఎస్పీ హర్షవర్ధన్ రాజు శుక్రవారం పరిశీలించారు. గంటవానిపల్లెలోని హెలిప్యాడ్, సభా వేదిక వద్ద ఏర్పాట్లను కలెక్టర్ విజయ సునీత పర్యవేక్షించారు. వీఐపీల పార్కింగ్, ప్రజలకు అవసరమైన వసతులు, ఇతర ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ ఆదేశించారు. కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు, ఎస్పీ వెంట మార్కాపురం డీఎస్పీ యు.నాగరాజు తదితరులు ఉన్నారు.
సీఎం రాక.. వాహనదారులకు తిప్పలు
గిద్దలూరు రూరల్: వుుఖ్యమంత్రి చంద్రబాబు శనివారం గిద్దలూరు మండలంలోని కిష్టంశెట్టిపల్లె పర్యటనకు వస్తున్న నేపథ్యంలో, అధికారులు విధించిన ట్రాఫిక్ ఆంక్షలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు పలు రూట్లలో వాహనాలను మళ్లించారు. నంద్యాల నుంచి గిద్దలూరుకు కేవలం 60 కి.మీ. దూరం ఉండగా, ఆంక్షల వల్ల ఆళ్లగడ్డ, మైదుకూరు, పోరుమామిళ్ల, కలసపాడు మీదుగా సుమారు 150 కి.మీ. ప్రయాణించాల్సి వస్తోంది. అలాగే మార్కాపురం నుంచి నంద్యాల వెళ్లే వాహనాలను తాటిచెర్ల, కొమరోలు మీదుగా మళ్లించారు. ఈ ఆంక్షలతో ప్రయాణ దూరం భారీగా పెరిగి, సమయం వృథా కావడంతోపాటు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.


