బేస్తవారిపేట: హైవేపై కారు అదుపుతప్పి పల్టీలు కొట్టిన ఘటనలో బేస్తవారిపేట గాంధీబజార్‌కు చెందిన దూదేకుల రసూల్ (25) అక్కడికక్కడే మృతి చెందాడు. గురువారం అర్ధరాత్రి చింతలపాలెం సమీపంలో తోకపల్లె–కడప హైవేరోడ్డుపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు.. గుంటూరులో కారు సర్వీసింగ్ చేయించుకుని ఒంటరిగా స్వగ్రామానికి వస్తుండగా, బేస్తవారిపేట సమీపంలో టిప్పర్‌ను ఓవర్‌టేక్ చేసే క్రమంలో మార్జిన్ గుంత కారణంగా వాహనం అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జు కాగా, రసూల్ అక్కడికక్కడే మరణించాడు. అటుగా వెళ్తున్న వాహనదారులు గమనించి రసూల్‌ను కంభం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య తస్లీమా, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోవడంతో తల్లిదండ్రులు చంటి, మస్తానమ్మ,, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అదుపుతప్పి పల్టీలు కొట్టిన కారు బేస్తవారిపేట సమీపంలో సంఘటన


