అవినీతి ప్లానింగ్‌..! | - | Sakshi
Sakshi News home page

అవినీతి ప్లానింగ్‌..!

Jun 26 2026 7:45 AM | Updated on Jun 26 2026 7:45 AM

అవినీతిమయంగా మారిన ఒంగోలు పట్టణ ప్రణాళికా విభాగం బీపీఎస్‌ స్కీములో భారీ ఎత్తున అక్రమాలు టౌన్‌ ప్లానింగ్‌లోని 13 మంది అధికారులు, సిబ్బంది ఇళ్లలో ఏసీబీ సోదాలు ఈ ఏడాది మార్చి10న ఏసీబీ సోదాల్లో అక్రమాలు వెలుగులోకి.. సుమారు రూ.3.36 కోట్లు మింగేశారన్న ఆరోపణలు ఫోన్‌ పేల ద్వారా రూ.1.18 కోట్లు వసూలు చేశారని గుర్తింపు సెలవుపై వెళ్లిన కమిషనర్‌ కుటుంబ సభ్యులకు ఫోన్‌ పే ద్వారా రూ.70 లక్షల లావాదేవీలు ప్రస్తుతం ఆయనపైనా ముమ్మరంగా విచారణ ఏసీబీ సోదాలతో ఒంగోలు టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో కుదుపు కార్పొరేషన్‌లో అవినీతి కంపుపై ‘సాక్షి’లో వరుస కథనాలు

కీలక అధికారి వసూళ్ల పర్వం...

ఒంగోలు నగరపాలక సంస్థలో అవినీతి రాజ్యమేలుతోంది. ఇక్కడ ప్రతి పనికీ ఒక రేటు కట్టి వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా టౌన్‌ప్లానింగ్‌ విభాగం వసూళ్లకు అడ్డాగా మారిపోయింది. ఈ విభాగంపై వస్తున్న ఆరోపణలపై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. ఫోన్‌ పే, గూగుల్‌ పే, పేటీఎంల ద్వారా వసూళ్లకు పాల్పడుతున్న 13 మందిపై కేసులు నమోదు చేయడం, గురువారం ఏకకాలంలో వారి ఇళ్లపై ఆకస్మిక దాడులు నిర్వహించడం సంచలనంగా మారింది. అవినీతికి చిరునామాగా మారిన కార్పొరేషన్‌పై ‘సాక్షి’ పలు కథనాలను కూడా ప్రచురించింది.

సాక్షి ప్రతినిధి, ఒంగోలు:

ఒంగోలు నగరపాలక సంస్థ అనినీతి, అక్రమాలు పెచ్చుమీరాయి. అన్ని విభాగాలపై ఆరోపణలు వస్తున్నప్పటికీ.. టౌన్‌ ప్లానింగ్‌లో జరుగుతున్న అవినీతికి అంతే లేకుండా పోయింది. నగరంలో జరుగుతున్న వేలాది అక్రమ నిర్మాణాలకు కర్త, కర్మ, క్రియ పట్టణ ప్రణాళికా విభాగం అధికారులనే విషయం విధితమే. మూటలు అందితే చాలు.. అది ఎంతటి అక్రమమైనా సక్రమమైపోతుంది. భవన నిర్మాణానికి ప్లాను ఉంటే ఒక రేటు.. ప్లాను లేకుంటే మరో రేటు అన్నట్టుగా ఒంగోలు నగరపాలక సంస్థ టౌన్‌ ప్లానింగ్‌ రూటే సప‘రేటు‘గా మారింది. దీంతో నగరంలో అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు వెలిశాయి. తాజాగా ప్రభుత్వం అమలు చేసిన అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ (బీపీఎస్‌) స్కీంను ఒంగోలు నగరపాలక సంస్థ అధికారులకు వరంగా మార్చుకున్నారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. క్రమబద్ధీకరణ మాటున కార్పొరేషన్లో ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి ఉద్యోగి వరకూ అందిన కాడికి దోచుకుని జేబులు నింపుకున్నారన్న ఆరోపణలున్నాయి. నగరపాలక సంస్థ టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది ఇళ్లపై గురువారం ఒంగోలు ఏసీబీ అధికారులు ఒక్కసారిగా దాడి చేసి సోదాలు నిర్వహించడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. నగర పాలక సంస్థ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై ఈ ఏడాది మార్చి 10వ తేదీ అవినీతి నిరోదక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. విచారణలో వెలుగు చూసిన వివరాలను పరిశీలించిన ఏసీబీ అధికారుల కళ్లు బైర్లుగమ్మాయి. ఒక టౌన్‌ ప్లానింగ్‌ అధికారికి చెందిన ఫోన్‌ పే, గూగుల్‌ పే, పేటీఎంల ద్వారా దాదాపు రూ.75 లక్షలకుపైగా లావాదేవీలు జరిగాయని తెలుస్తోంది. మరో రూ.43 లక్షల లావాదేవీలు వివిధ స్థాయి అధికారులు, సిబ్బంది ఫోన్ల ద్వారా జరిగాయని అధికారులు గుర్తించినట్టు తెలిసింది. బీపీఎస్‌ ద్వారా అధికారులు నొక్కింది సుమారు రూ.3.36 కోట్లు. అందులో ఫోన్‌ పేల ద్వారా రూ.1.18 కోట్లకుపైగా లావాదేవీలు జరిగాయని అధికారులు గుర్తించారు. బీపీఎస్‌ స్కీమ్‌కు సంబంధించి పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని నిర్ధారణకు వచ్చాక ఏసీబీ అధికారులు రెండు రోజుల క్రితం 13 మందిపై కేసు నమోదు చేశారు. ఆ కేసుకు సంబంధించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆదాయానికి మించిన ఆస్తులపై గురువారం పెద్ద ఎత్తున సోదాలు చేశారు.

విస్తృతంగా తనిఖీలు...

టౌన్‌ ప్లానింగ్‌ టీపీఎస్‌ ఎస్‌కే రసూల్‌తో పాటు టీపీబీఓలు ఎం.ప్రకాశ్‌రెడ్డి, కే మణిరావు, కే ముకేష్‌ కుమార్‌, బి.ప్రవీణ్‌ కుమార్‌, డి.రవి తేజ, బి.శరత్‌, జీ శ్రీకాంత్‌, డి.శశిధర్‌తో పాటు మరో ముగ్గురు ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న సమాచారంతోనే తనిఖీలు నిర్వహించారు. నెల్లూరు ఏసీబీ డీఎస్పీ రామకృష్ణుడు ప్రకాశం జిల్లా ఏసీబీకి ఇన్‌చార్జ్‌ డీఎస్పీగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో ఒంగోలు సీఐలు టీవీ శ్రీనివాస్‌, బి.రమేష్‌బాబుతో పాటు గుంటూరు నుంచి ఐదుగురు సీఐలు, నెల్లూరు నుంచి మరో ఇద్దరు సీఐలతో పాటు ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల నుంచి మొత్తం 40 మందికిపైగా సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఏసీబీ అధికారులు ఏకకాలంలో పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించడం పెద్ద ఎత్తున కలకలం రేపింది.

పాత కమిషనర్‌పైనా విచారణ...

దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిన పాత కమిషనర్‌పై కూడా ఏసీబీ అధికారులు నూతనంగా విచారణ చేపట్టారు. మార్చి పదో తేదీ ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడుల్లో సదరు అధికారి అక్రమాలు కూడా వెలుగుచూసినట్టు తెలిసింది. ఆయన భార్యతో పాటు కుటుంబీకులకు దాదాపు రూ.70 లక్షల వరకూ ఫోన్‌ పే లావాదేవీలు జరిపినట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు గుర్తించినట్టు సమాచారం. ఆయనపై అంతర్గతంగా విచారణ చేస్తున్నట్లు తెలిసింది.

టౌన్‌ ప్లానింగ్‌, రెవెన్యూ, శానిటేషన్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో పనిచేస్తున్న తనకు అనుకూలమైన ఉద్యోగులను బినామీలుగా ఏర్పాటు చేసుకున్న కీలక అధికారి భారీ ఎత్తున ముడుపులు వసూలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. పాలకవర్గం గడువు తీరడంతో ఆ అధికారి ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. నగరంలో ఒక్కో భవన నిర్మాణానికి భారీగా ముడుపులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. భవన నిర్మాణాల అనుమతుల్లో సుమారు రూ.2 కోట్లకుపైగా వసూలు చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో భవన నిర్మాణాలు చేపట్టాలంటేనే జనం భయపడిపోతున్నారు. సదరు అధికారి చెత్త సేకరణ నుంచి పన్నులు వసూలు చేస్తూ భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంజినీరింగ్‌ పనుల్లో 7 శాతం వసూలు చేసేవారని సమాచారం. అందరివీ కలిపి 15 శాతం వరకూ తనకే ఇవ్వాలని హుకుం జారీ చేశారని తెలిసింది. నగర పాలక సంస్థలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ‘సాక్షి’ దినపత్రిక పలు కథనాలను ప్రచురించిది. కార్పొరేషన్‌లోని పలు విభాగాల్లొ జరుగుతున్న దందాను వెలుగులోకి తెచ్చింది. ఏసీబీ అధికారుల దాడులతో సాక్షి కథనాలు అక్షర సత్యాలుగా నిలిచాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement