ఒంగోలు వన్‌టౌన్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియలో డిజిటైజేషన్‌ను వేగవంతం చేయాలని కలెక్టర్ పి.రాజాబాబు బీఎల్‌ఓలనుఆదేశించారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా సర్ కార్యక్రమంజరుగుతున్న తీరును పరిశీలించేందుకు నగరంలోని కబాడీపాలెంలో గురువారం పర్యటించారు. ప్రతి ఇంటికి ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చి ప్రజల నుంచి వివరాలు సేకరిస్తున్న విధానాన్ని పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ 87 శాతం పూర్తయిందని, మిగిలిన ఓటర్లు అందుబాటులో లేరని అధికారులు తెలిపారన్నారు. ఇటువంటి వారి ఆచూకీ తెలుసుకునేందుకు బీఎల్‌ఏల సహకారం తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ నెల 27, 28 తేదీల్లో ఈ పత్రాల డిజిటైజేషన్‌పై ప్రత్యేక దృష్టిసారించి పూర్తి చేయాలని ఆధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ చంద్రశేఖర్‌నాయుడు, తహసీల్దార్ కృష్ణమోహన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఒంగోలు: ఫుట్‌బాల్ బాలబాలికల సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ క్రీడాకారుల ఎంపికను ఈ నెల 28వ తేదీ నిర్వహించనున్నట్లు ప్రకాశం జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు అంచిపోగు రమేష్‌బాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2013 జనవరి ఒకటి నుంచి 2014 డిసెంబర్ 31వ తేదీ మధ్య జన్మించిన వారు సబ్ జూనియర్స్ విభాగానికి అర్హులని తెలిపారు. అదేవిధంగా 2011 జనవరి 1 నుంచి 2012 డిసెంబర్ 31 మధ్య జన్మించిన వారు జూనియర్స్ విభాగానికి హాజరుకావాల్సి ఉంటుందన్నారు. ఉదయం 8 గంటలకు స్థానిక డీఆర్‌ఆర్‌ఎం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఎంపిక పోటీలు జరుగుతాయన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు తప్పనిసరిగా ఆధార్‌కార్డు, రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలతో రావాలని సూచించారు. పూర్తి వివరాలకు అసోసియేషన్ ఉపాధ్యక్షులు కె.రోజర్‌బిన్ని (9908822193)ని సంప్రదించాలని కోరారు.
ఒంగోలు వన్‌టౌన్: ఒంగోలు రూడ్‌సెట్ సంస్థ ఆధ్వర్యంలో జూలై 6వ తేదీ నుంచి మహిళలకు మగ్గం వర్క్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మగ్గం వర్క్, ఎంబ్రాయిడరీ, ఫ్యాబ్రిక్ పెయింటింగ్లో శిక్షణ ఉంటుందన్నారు. 31 రోజుల పాటు నిర్వహించనున్న ఈ శిక్షణకు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నిరుద్యోగ మహిళలు అర్హులని తెలిపారు. అభ్యర్థుల వయసు 19 నుంచి 50 సంవత్సరాల్లోపు ఉండాలన్నారు. అభ్యర్థులు ఆధార్ కార్డు, రేషన్ కార్డు కలిగి ఉండాలన్నారు. శిక్షణ కాలంలో భోజనం, వసతి కూడా పూర్తి ఉచితంగా కల్పించనున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాలకు 95733 63141 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
● జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఇన్‌చార్జి కార్యదర్శి రామకృష్ణ
ఒంగోలు టౌన్: మత్తు పదార్థాలకు అలవాటు పడితే భవిష్యత్తు నాశనం అవుతుందని, అనారోగ్యానికి గురికావడమే కాకుండా ఆర్థికంగా కూడా చితికిపోతారని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఇన్‌చార్జి కార్యదర్శి సీహెచ్ రామకృష్ణ తెలిపారు. మత్తు పదార్థాలకు బానిసలుగా మారి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న రోగులు, వారి కుటుంబ సభ్యులకు గురువారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మానసిక రోగులకు అందుతున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాలకు బానిసలైన వారు సమాజంలో చిన్నచూపునకు గురవుతారని తెలిపారు. గంజాయి వంటి మత్తు పదార్థాలు సేవించినా, రవాణా చేసినా చట్ట ప్రకారం తీవ్రమైన శిక్షలుంటాయని హెచ్చరించారు. ప్రతిఒక్కరూ గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు, ఈగిల్ సభ్యులు, జీజీహెచ్ నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.


