కలెక్టరేట్‌ను ముట్టడిస్తాం | - | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌ను ముట్టడిస్తాం

Jun 26 2026 7:45 AM | Updated on Jun 26 2026 7:45 AM

పొగాకు పంటకు గిట్టుబాటు ధరలు కల్పించకుంటే పోరాటం ఉధృతం చేస్తాం సంయుక్త కిసాన్‌ మోర్చా హెచ్చరిక

ఒంగోలు టౌన్‌: పొగాకు పంటకు గిట్టుబాటు ధరల కోసం గత 45 రోజులుగా పోరాటం చేస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదని సంయుక్త కిసాన్‌ మోర్చా జిల్లా కన్వీనర్‌ చుండూరి రంగారావు ధ్వజమెత్తారు. పొగాకు రైతుల సమస్యను అత్యవసర సమస్యగా పరిగణించి పరిష్కారానికి చొరవ చూపకపోతే ఈ నెల 27వ తేదీ కలెక్టరేట్‌ ఎదుట వేలాది మందితో సామూహిక దీక్షలు చేపట్టి ముట్టడిస్తామని హెచ్చరించారు. పొగాకు కొనుగోలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.1000 కోట్లు కేటాయించాలని, ఎస్‌టీసీ, మార్క్‌ఫెడ్‌, పొగాకు సమాఖ్య ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ సంయుక్త కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టరేట్‌ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం రెండో రోజుకు చేరాయి. రైతు కూలీ సంఘ జిల్లా నాయకులు పరిటాల కోటేశ్వరరావు, సీఎస్‌ సాగర్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో చుండూరి రంగారావు పాల్గొని మాట్లాడారు. రైతుల సామూహిక దీక్షలకు ప్రతి గ్రామం నుంచి రైతులు, వ్యవసాయ కార్మికులు, పొగాకు ఆధారిత కుటుంబాలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. అఖిల భారత రైతు కూలీ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నెలన్నరగా పొగాకు రైతులు న్యాయం కోసం పోరాడుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం రైతుల పట్ల పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని చెప్పారు. రైతులు ఐక్య పోరాటాలు చేస్తేనే ప్రభుత్వం దిగి వస్తుందన్నారు. ఢిల్లీలో జరిగిన రైతు పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని పొగాకు రైతులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. పొగాకు బోర్డు ద్వారా పొగాకు కొనుగోలు చేయడమొక్కటే పరిష్కారమని, కేంద్రంపై తగిన స్థాయిలో ఒత్తిడి చేయకపోతే ప్రయాజనం ఉండదని తేల్చి చెప్పారు. క్వింటా ధర రూ.25 వేలుగా నిర్ణయించి ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు.

సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.రమేష్‌ మాట్లాడుతూ పొగాకు పండించడానికి ఆరుగాలం శ్రమిస్తున్న రైతులు.. ఆ పంటను అమ్ముకోవడానికి రోడ్డెక్కాల్సి రావడం బాధాకరమన్నారు. పొగాకు ద్వారా ఏడాదికి సుమారు రూ.50 వేల కోట్ల లాభాలను ఐటీసీ పొందుతోందన్నారు. కానీ, పొగాకు రైతు మాత్రం గిట్టుబాటు ధరలు లేక తీవ్రంగా నష్టపోయి అప్పుల పాలవ్వడం వెనక ఉన్న కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రైతుల సమస్యలు పట్టించుకోని ప్రభుత్వాలకు భవిష్యత్తులో గట్టి గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా అధ్యక్షుడు నెరుసుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పొగాకు రైతుల ప్రయోజనాల కంటే కంపెనీ లాభాలకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు. రైతుల శ్రమ శక్తిని దోచుకుంటున్న కంపెనీలు, వ్యాపారులను నియంత్రించాల్సిన ప్రభుత్వాలు వారికి కొమ్ముకాయడం దుర్మార్గమన్నారు. పొగాకు రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. నిరాహార దీక్షలో రైతు సంఘాలు, కమ్యూనిస్టు పార్టీల నాయకులు ఎంఎస్‌ సాయి, ఆర్‌.మోహన్‌, సర్దార్‌, జి.శేషయ్య, లక్ష్మీనారాయణ, హనుమారెడ్డి, అబ్బూరి వెంకటేశ్వర్లు, పెద్దబ్బాయి, పి.కల్పన, ఎల్‌.రాజశేఖర్‌, టి.శ్రీకాంత్‌, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement