వేదికపై మాట్లాడుతున్న అన్నా రాంబాబు, పాల్గొన్న నాయకులు
హాజరైన ప్రజలు
● వైఎస్సార్ సీపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి అన్నా రాంబాబు
మార్కాపురం రూరల్: ఎన్నికల హామీలు అమలు చేయకపోగా, పరిపాలనలో పూర్తిగా విఫలమైన కూటమి ప్రభుత్వం రెండేళ్లకే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని వైఎస్సార్ సీపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు విమర్శించారు. తర్లుపాడు మండలంలోని తుమ్మలచెరువు గ్రామంలో ఏటా పెద్ద ఎత్తున నిర్వహించే పీర్ల పండుగ సందర్భంగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో గురువారం రాత్రి నిర్వహించిన పాట కచేరిలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రతి మహిళకు నెలకు రూ.1,500 ఇస్తామని, నిరుద్యోగులకు రూ.3,000 భృతి అందిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. రెండేళ్లు గడిచినా వాటిని అమలు చేయలేదని విమర్శించారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, చంద్రబాబు ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని మండిపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిందని వివరించారు. 2024లో అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోవడంతో 2029 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయం ఖాయంగా కనిపిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ మోసపు మాటలను ప్రజలు ఇకపై నమ్మరని అన్నా రాంబాబు అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు అన్నా కృష్ణచైతన్య, గోలమారి శ్రీనివాస్‌రెడ్డి, భూలక్ష్మి రామసుబ్బారెడ్డి, గాయం శ్రీనివాస్‌రెడ్డి, మురారి వెంకటేశ్వర్లు, అక్బర్ అలీ, కోలగట్ల వెంకటేశ్వరరెడ్డి, పఠాన్ అబ్దుల్లా, సయ్యద్ మబ్బులి, మాజీ సర్పంచ్ షాజహాన్, బట్టగిరి తిరుపతిరెడ్డి, ఉత్తం తదితరులు పాల్గొన్నారు.


