హోమియో సేవలకు గ్రహణం | - | Sakshi
Sakshi News home page

హోమియో సేవలకు గ్రహణం

Jun 26 2026 7:45 AM | Updated on Jun 26 2026 7:45 AM

కొనకనమిట్ల:

ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ప్రభుత్వ హోమియో వైద్యశాలలు సిబ్బంది కొరతతో కుదేలవుతున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ హోమియో వైద్యశాలలు ప్రస్తుతం మూతపడి దర్శనమిస్తున్నాయి. నామమాత్రంగా ఉన్న సిబ్బందిని సైతం బదిలీలు, డిప్యుటేషన్ల పేరుతో తరలించడంతో వైద్యసేవలు పూర్తిగా నిలిచిపోయాయి. దీనివల్ల నిరుపేద రోగులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. కొనకనమిట్ల మండలంలోని పెదారికట్ల, కొమరోలు మండలంలోని రెడ్డిచర్ల, బేస్తవారిపేట మండలంలోని మోక్షగుండం, యర్రగొండపాలెం మండలంలోని వెంకటాద్రిపాలెం, త్రిపురాంతకం మండలంలోని దూపాడు, పెద్దారవీడు మండలంలోని సానికవరం, పుల్లలచెరువు మండలంలోని యండ్రపల్లి గ్రామాల్లో హోమియో వైద్యశాలల తలుపులు మూసుకుని ఏళ్లు గడుస్తోంది. డాక్టర్లు, కాంపౌండర్లు లేకపోవడంతో ఆసుపత్రుల్లో ఉన్న విలువైన మందులు, సామగ్రి దుమ్ము పడుతున్నాయి. గతంలో పలుమార్లు క్షేత్రస్థాయి పరిస్థితులపై ఫిర్యాదులు చేసినా, మీడియాలో కథనాలు వచ్చినప్పటికీ అధికారుల స్పందన శూన్యం. గతంలో ’ఆయుష్‌’ శాఖాధికారులు మూతపడిన వైద్యశాలలను పునఃప్రారంభిస్తామని ఇచ్చిన హామీలు కాగితాలకే పరిమితమయ్యాయి. నిరంతరం నిధుల కేటాయింపులు, బడ్జెట్‌ అంటున్న ప్రభుత్వం, కనీసం ఈ వైద్యశాలలను నిర్వహించడంలో ఎందుకు విఫలమవుతోందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

రోగుల ఆవేదన

హోమియో మందుల మీద నమ్మకంతో చాలా మంది ప్రజలు ఇన్నాళ్లు ఈ ఆసుపత్రులకు వచ్చేవారు. ఇప్పుడు వైద్యశాలలు తెరవకపోవడంతో చికిత్స కోసం దూరప్రాంతాలకు, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వం వెంటనే స్పందించి, ఖాళీగా ఉన్న డాక్టర్‌, సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని, మూతపడిన ఆసుపత్రులను వెంటనే తెరిపించాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

మార్కాపురం జిల్లాలో మూతపడిన ప్రభుత్వ హోమియో ఆస్పత్రులు

పెదారికట్లలో డాక్టర్‌ లేరు..

డిప్యుటేషన్‌లో కాంపౌండర్‌

మరో ఆరు వైద్యశాలలదీ ఇదే దుస్థితి..

హోమియో వైద్యశాలను తెరిపించాలని వేడుకుంటున్న ప్రజలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement