మార్కాపురం పట్టణ సమీపంలోని గుండ్లకమ్మ చెత్త వ్యర్థాల కేంద్రంగా మారి కంపు కొడుతోంది. పట్టణంలో ఉన్న చెత్తాచెదారాన్ని తీసుకొచ్చి గుండ్లకమ్మలో పోస్తుండటంతో పరిస్థితి రోజురోజుకూ దారుణంగా తయారవుతోంది. నదిలో నీరు కలుషితమై ఆకుపచ్చని రంగులోకి మారడంతో దుర్వాసన వస్తోంది. గిద్దలూరు నియోజకవర్గంలోని రాచర్ల మండలం నెమలిగుండం నుంచి ప్రారంభమయ్యే గుండ్లకమ్మ ప్రవాహం 3 జిల్లాల్లోని 7 నియోజకవర్గాలను కలుపుతూ ఒంగోలు రూరల్ మండలంలోని ఉలిచి వద్ద సముద్రంలో కలుస్తోంది. అయితే ప్లాస్టిక్ వ్యర్థాలు, కుళ్లిపోయిన పండ్లు, ఖాళీ కొబ్బరి బొండాలు, మాంస వ్యర్థాలు గుండ్లకమ్మలో పడేస్తుండటంతో సమీప ప్రాంతాల్లో దోమలు విజృంభించి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. గతంలో స్వచ్ఛమైన నీటితో గలగలా పారే గుండ్లకమ్మ ప్రస్తుతం గుర్రపుడెక్క, వ్యర్థాలు, పిచ్చిచెట్లతో నిండిపోయింది. ఈ పరిణామం నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారింది. తుఫాన్ల సమయంలో నీటి ఉధృతికి గుండ్లకమ్మలో వ్యర్థాలన్నీ కొట్టుకుపోయినా కొద్ది కాలానికే పరిస్థితి మొదటికొస్తోంది. గుండ్లకమ్మలో వ్యర్థాలు వేయకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. – మార్కాపురం


