సింగరాయకొండ: పురాణ ప్రసిద్ధి చెందిన పాతసింగరాయకొండ వరాహా లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ధ్వజారోహణం కనులపండువగా నిర్వహించారు. స్వామిని ప్రత్యేక అలంకరణలో ఆలయంలో ఊరేగించి ధ్వజస్తంభం వద్ద వేదపండితుల మంత్రోచ్ఛరణ మధ్య ధ్వజారోహణం నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి గరుడ ప్రసాదాన్ని భక్తులకు అందజేసారు. గరుడ ప్రసాదం స్వీకరించిన మహిళలు ప్రసాదాన్ని నిష్ఠగా ఆరగించి 9 రోజులు పాటు నిష్టగా ఉంటే పండంటి బిడ్డ పుడతాడని ప్రతీతి. ఈ గరుడ ప్రసాదం కోసం రాష్టంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు.
చంద్రప్రభ వాహనంపై స్వామివారు
వరాహాలక్ష్మీనరసింహస్వామి రాత్రికి ప్రత్యేక అలంకరణలో చంద్రప్రభ వాహనం పై భక్తులకు దర్శనమిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలో ఊరేగింపు నిర్వహించి తరువాత గ్రామోత్సవం నిర్వహించారు. ఉత్సవాల ఆలయాన్ని విద్యుద్దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. శుక్రవారం ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రికి హంసవాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనమిస్తారని ఆలయ ఈఓ పి.కృష్ణవేణి వివరించారు. ధ్వజారోహణ సందర్భంగా భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు ఉదయగిరి వెంకట లక్ష్మీనరసింహాచార్యులు, ఉదయగిరి లక్ష్మీనరసింహాచార్యులు, ఉదయగిరి నందకిషోర్, ఆలయ అభివృద్ది కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
చంద్రప్రభ వాహనంపై
వరాహ లక్ష్మీనరసింహస్వామి


